ఎస్‌ఎస్‌ఏలో ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగుల టెర్మినేషన్‌

ఎస్‌ఎస్‌ఏలో ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగుల టెర్మినేషన్‌– ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఆదేశాలు
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న పార్ట్‌ టైం ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. సమగ్ర శిక్షలో పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న సుమారు 2300 మంది ఒప్పంద ఉపాధ్యాయులను ఈనెల 23 పాఠశాల చివరి పని దినం రోజున విధుల నుంచి తొలగిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీరికి ఎన్నికల్లో డ్యూటీ చేయాలని తిరిగి జీవో జారీ చేయడం విడ్డూరంగా ఉందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్స్‌ స్ట్రగుల్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షులు తిరువరంగం ప్రభాకర్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగులకు పూర్తిస్థాయిలో 12 నెలలకు నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మాత్రం కేవలం 10 నెలల వేతనాలు ఇచ్చి రెండు నెలల వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగంలో నుంచి టర్మినేషన్‌ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రవీందర్‌ రాజు మాట్లాడుతూ.. 12 ఏండ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్‌లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని, లేకుంటే ఎన్నికల విధులకు హాజరు కామని తేల్చిచెప్పారు. జిల్లా నాయకులు ఉపేందర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగంలో నుంచి టర్మినేషన్‌ చేసి ఎన్నికల విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. 12 సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్ల టర్మినేషన్‌ను ఎత్తివేసి రీ ఎంగేజ్‌మెంట్‌ ఉత్తర్వులు ఇవ్వాలని, లేని పక్షంలో ఎన్నికల విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Spread the love