సువర్ణభూమి – ఆగేయాసియా

– తంగిరాల చక్రవర్తి, 9393804472
చరిత్రను నవలా రూపంలో చెప్పడం చాలా కష్టం. క్రీ.శ. 12వ శతాబ్దకాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించే ఈ నవల ఆగేయాసియా రాజ్యంలోకి భారతీయ సంస్కృతి – మతం ఎలా వ్యాపించాయో వివరిస్తుంది.
వివిధ దేశాలలో బౌద్ధాలయాల్ని గురించి రాసి ప్రచురించడం బాగుంది. ఈ రచయిత గతంలో ‘ఏన్షియంట్‌ మాన్యుమెంట్స్‌ ఎరౌండ్‌ హైదరాబాద్‌’ అనే కాఫీ టేబుల్‌ పుస్తకం రాసి ప్రచురించారు. ఈ పుస్తకం చివరి పేజీలో తెలుగు పదాల పదకోశం ప్రచురించారు. బాగుంది. (ఉదా: యోజన – దూరాన్ని లెక్కించే సూచి, స్తపతి – శిల్పకారుడు, గనిక – వినోదాన్ని కల్గించే స్త్రీ.). 13వ శతాబ్దంలో హిందూ – బౌద్ధ మతాల మధ్య వైరిభావం నెలకొన్న తర్వాత ఆగేయాసియా రాజ్యాల్లో ఈ రెండు మతాల మధ్య అద్భుతమైన సంబంధం అభివృద్ధి చెందింది అంటారు రచయిత. 1943లో సుభాష్‌ చంద్రబోస్‌ – ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ లేదా అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించింది ఆగేయాసియాలోనే. స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని కూడా మొదటి అక్టోబర్‌ 22, 1943 లో స్థాపించింది ఆ నేల మీదే. ఇలా ఎన్నో ఆసక్తికర చారిత్రక ప్రధానాంశాలు ఈ పుస్తకం నిండా వున్నాయి.
చారిత్రక నవలా బిగువుతో చివరి దాకా ఉత్సుకతతో నవల సాగుతుంది. ఆగేయాసియాలో హిందూ మరియు బౌద్ధ రాజ్యాలు బర్మా, కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, బాలి ద్వీపం, శ్రీలంక ల గూర్చి రాసిన చారిత్రక కథనం బాగుంది. ఆనాడు తెలంగాణ ఉత్తర దిశలో వేములవాడ చాళుక్యులు, దక్షిణాన కుందూరు చోళులు, పశ్చిమాన కొల్లిపాక రాజ్యం, తూర్పున వేంగి చాళిక్యుల వారసులు పాలించే 12వ శతాబ్ది కాలంలో హనుమకొండ ప్రాంతాన్ని కాకతీయులు పాలన చేస్తున్నారు. క్రీ.శ. 1115లో అనేక మంది చుట్టుపక్కల రాజుల్ని ఓడించి కాకతీయ ప్రోలుడు తన అధికారాన్ని స్థిరికరించుకున్నాడు. ఆనాటి యుద్ధాల్లో ఓడిన ఒక నాయకుడే ఈ పుస్తకంలోని నవలా కథానాయకుడు సిద్ధుడు (యువరాజు).
‘తెలుగు చరిత్ర’ (పేజీ 19) భాగాన్ని పాఠ్యాంశంగా పెడితే రేపటి తరానికి తెలంగాణ చరిత్ర, ప్రాశస్త్యం తెలుస్తుంది. కృష్ణా, గోదావరి లోయల్లో గొప్ప బౌద్ధ క్షేత్రాలున్నాయి. దీన్లోని ఛాయాచిత్రాలు ఆసక్తి కలిగిస్తాయి. ఓ గొప్ప చారిత్రాత్మక నవలా పుస్తకం ఇది. రచయిత కృషి శ్లాఘనీయం.
రచయిత : ఎస్‌.ఉదయభాను
అనువాదం : జి.శివరామకృష్ణయ్య
పేజీలు : 192, వెల : 300/-
ప్రతులకు : క్రియేటివ్‌ లింక్స్‌,
1-8-725/ఎ/1, 103 సి, బాలాజీ భాగ్యనగర్‌ అపార్ట్‌మెంట్స్‌, నల్లకుంట, హైదరాబాద్‌ – 500044.
ఫోన్‌ : 9848506964.

Spread the love