తమిళనాడు తరహా తాటి ఉత్పత్తుల కేంద్రం

– కల్లుగీత కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌
– చెన్నైలోని నీరా తయారీ, సీపీపీపీఐ కేంద్రాలను సందర్శించిన బృందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మన రాష్ట్రంలోనూ గీత వృత్తి అభివృద్ధి చేసేందుకు తమిళనాడు తరహాలో తాటి ఉత్పత్తులకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కల్లుగీత కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌గౌడ్‌ అన్నారు. సెంట్రల్‌ ఫామ్‌గర్‌ అండ్‌ ఫామ్‌ ప్రొడక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీపీపీపీఐ)లోని ఉత్పత్తుల గురించి తెలుసుకున్నామని తెలిపారు. గౌడ సామాజిక తరగతికి లబ్ది చేకూరేవిధంగా ఈ తరహా కేంద్రాల ఏర్పాటుకు కషి చేస్తామని చెప్పారు. ఈ పర్యటనకు సంబంధించి ఓ నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పల్లె రవికుమార్‌ ఆధ్వర్యంలో బీసీ కమిషన్‌ సభ్యులు కిశోర్‌గౌడ్‌, కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదరుప్రకాశ్‌ సోమవారం తమిళనాడులో పర్యటించారు. చెన్నై నగర శివారులోని మాధవవరంలో ఉన్న సీపీపీపీఐ, తమిళనాడు ఫామ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు నిర్వహి స్తున్న అగ్మోర్‌లోని నీరా కేంద్రాన్ని సందర్శించారు. తాటి చెట్టు ఆకులు, మట్టలు, కల్లు నుంచి తాటి బెల్లం, తాటి షుగర్‌, నీరా, అలంకరణ తదితర వస్తువుల తయారీ యూనిట్లను పరిశీలించారు. అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రభాకరన్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వీఎస్‌.రావు రాష్ట్ర బందానికి సంస్థలోని వివిధ యూనిట్ల పనితీరు, ఉత్పత్తుల గురించి వివరించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలను చేపట్టిందన్నారు. కల్లుగీత కార్మికులకు రూ.5లక్షల బీమా(గీతన్న బీమా) త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. రూ.12 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. వైన్స్‌ షాపుల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్‌ కలిపించామని గర్తుచేశారు. కల్లుగీత వత్తిదారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా పెన్షన్‌ విధానం ప్రవేశపెట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో గౌడ సామాజిక తరగతి సంక్షేమం, భద్రత కోసం మరిన్ని చర్యలు చేపట్టేందుకు కషి చేస్తున్నామని వివరించారు.

Spread the love