అమ్మకు డాక్టర్‌ …నాకు రాజకీయం ఇష్టం

– గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”నాకు రాజకీయాలంటే బాల్యం నుంచే ఇష్టం. అమ్మ బలవంతంతోనే డాక్టరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు భవిష్యత్తులో ఏమి కావాలనుకుం టున్నారు? అని విద్యార్థులను అడిగినప్పుడు నేను రాజకీయ నాయకురాలిని కావాలనుకుంటున్నానని చెప్పాను. ఇదే విషయాన్ని ఆ టీచర్‌ మా అమ్మతో చెప్పారు. మా అమ్మ ఇంటికి తీసుకెళ్లి రాజకీయా లంటే కుదరదు. డాక్టర్‌ కావాల్సిందేనని బలవంతం చేసింది. అమ్మ ఇష్టం మేరకు డాక్టరయ్యాను. నా ఇష్టం మేరకు రాజకీయ నాయకురాలినయ్యాను… ” అంటూ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాలులో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (న్యూఢిల్లీ) సహకారంతో రాజ్‌భవన్‌ ఏర్పాటు చేసిన రీడ్‌ ఇండియా – లీడ్‌ ఇండియా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ పఠనం అలవాటు చేసుకోవాలనీ, ఆ అలవాటు విద్యార్థులను నాయకులుగా మారుస్తుం దనీ, పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడే శక్తినిస్తుందని తెలిపారు. తన తండ్రి తనకు బహుకరించిన స్వామి వివేకానంద, తమిళ పద్య కారుడు భారతీయార్‌ పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయని ఆమె చెప్పారు. ఆ పుస్తకాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయనీ, ఇప్పటికీ ప్రతి రోజు కనీసం ఒక గంట పాటు చదువుకుంటానని తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక బుక్‌ రూం పెట్టుకోవాలని సూచించారు. చదువు ద్వారా వచ్చే జ్ఞానంతో సమాజంలో సంస్కరణలు తెచ్చే శక్తి సిద్ధిస్తుందన్నారు. అనంతరం ప్రధాని మోడీ రాసిన ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.

Spread the love