నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన అంశంపై తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ‘నేను ఎప్పటికీ మీ సోదరినే… తెలంగాణను వదిలి వెళుతున్నందుకు చాలా బాధగా ఉందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలను ఎన్నటికీ మరువ’నని ఆమె తెలిపారు. తాను ప్రజాసేవ కోసం తిరిగి వెళుతున్నానన్నారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకి బయలుదేరారు. లోక్ సభ ఎన్నికలలో ఆమె బీజేపీ తరఫున తమిళనాడులో బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ నుంచి తెలంగాణ గవర్నర్గా ఉన్నారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ఈ రెండింటికీ రాజీనామా చేశారు.