తరుణ్‌చుగ్‌ ఔట్‌.. ప్రకాశ్‌ జవదేకర్‌ ఇన్‌

– బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిని మార్చిన అధిష్టానం
– సహఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌
– అధిష్టానం అలర్ట్‌ అయినా పక్కచూపుల్లోనే నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న తరుణ్‌చుగ్‌ను ఆ పార్టీ అధిష్టానం బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను నూతన ఇన్‌చార్జిగా నియమించింది. ఆయనకు సహాయ ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌ వ్యవహరించనున్నట్టు పేర్కొంది. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నియామకాలు చేపట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఇన్‌చార్జీలనూ బీజేపీ మార్చింది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఇన్‌ చార్జిగా ఓపి మాథుర్‌, రాజస్థాన్‌ ఇన్‌చార్జిగా ప్రహ్లాద్‌ జోషి, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జిగా భూపేంద్ర యాదవ్‌ను, సహ ఇన్‌చార్జిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను నియమించింది.
చుగ్‌ను ఎందుకు తొలగించారంటే..
బండి సంజరు నేతలందర్నీ కలుపుకు పోకపోయినా, ఒంటెత్తు పోకడలకు పోతున్నా తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా తరుణ్‌చుగ్‌ సరిదిద్దకుండా వెనుకేసుకొచ్చారు. తెలంగాణలో పార్టీ అద్భుతంగా ముందుకెళ్తున్నదని జాతీయ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారు.
ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకుండా హైదరాబాద్‌ కేంద్రంగా కొందరు అగ్రనాయకులు షోయింగ్‌ చేస్తున్నారనే విషయాన్ని పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు సీనియర్లు భేటీ కూడా అయ్యారు. ఈ తరుణంలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసేందుకు మరో ఇన్‌చార్జిగా సునీల్‌బన్సల్‌ను రాష్ట్రానికి జాతీయ నాయకత్వం పంపింది. సంస్థాగత కమిటీల నిర్మాణంపై సమగ్రత రిపోర్టు కూడా ఇవ్వలేని పరిస్థితి గురించి జాతీయ నాయకత్వం ముందు బన్సల్‌ ఉంచారు. నిర్మాణపరంగా ఉన్న లోపాలను ఎత్తిచూపారు. అదే సమయంలో బండి సంజరు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఖర్చుల వివరాలు, హంగామాను చూసి బన్సల్‌ విస్తుపోయారు. ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

Spread the love