టీడీపీ సీనియర్‌ నాయకులు కొత్తకోట దయాకర్‌ రెడ్డి మృతి

పలువురు నివాళి
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొన్నేండ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న దయాకర్‌రెడ్డి.. వైద్య సేవలు పొందుతన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన మృతి పట్ల మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, ఎస్‌ రాజేందర్‌ రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా, రానున్న ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకొని ఏదైనా ప్రధాన పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. 1958 ఆగస్టు 18న నర్వ మండలం పర్కాపూర్‌ గ్రామంలో జన్మించిన దయాకర్‌ రెడ్డి డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1989లో అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994, 1999లో జరిగిన ఎన్నికల్లోనూ దయాకర్‌ రెడ్డి గెలిచారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మక్తల్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో ఆయన సతీమణి సీతా దయాకర్‌ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దేశంలో భార్యాభర్తలు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో సీత, దయాకర్‌ రెడ్డి దంపతులు నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తెలంగాణలో రాజకీయంగా పలు అవకాశాలు వచ్చినప్పటికీ ఆయన టీడీపీలోనే కొనసాగారు. దయాకర్‌ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Spread the love