ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌ లోక్సభ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ నిలిచారు. జౌన్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్రానికి చెందిన శ్రీకళా రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్‌ సింగ్‌ మూడో భార్య. ధనుంజయ్‌ సింగ్‌కు కిడ్నాప్‌, అక్రమవసూళ్ల కేసులో శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో తాజా ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్‌ ఇచ్చారు. శ్రీకళారెడ్డి తండ్రి కె.జితేందర్‌రెడ్డి. నల్గొండ జిల్లా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పని చేశారు. తల్లి లలితా రెడ్డి. గ్రామసర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీ గ్రూప్‌ కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. శ్రీకళ ఇంటర్మీడియట్‌ చెన్నైలో, బీకామ్‌ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేసి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు. ధనుంజయ్‌సింగ్‌ మొదటి భార్య చనిపోవడం, రెండోభార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని 2017లో పారిస్‌లో వివాహమాడారు.

Spread the love