వీఓఏల సమ్మె తాత్కాలిక వాయిదా

– హామీలు అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదు : సీఐటీయూ
నవతెలంగాణ-నల్లగొండ
ఐకేపీ వీఓఏ ఉద్యోగులు గత 44 రోజులు చేసిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె మంత్రి హామీ మేరకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ, తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీఓఏల నల్లగొండ జిల్లా విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీవోఏల న్యాయమైన డిమాండ్‌ల పరిష్కారానికి కృషి చేస్తానని, వేతనాలు పెంచుతామని, ఐడి కార్డులు, 10 లక్షల ప్రమాద బీమా, 58 జీవో సవరణ ఇతర సమస్యలు యూనియన్‌తో చర్చలు జరిపి నెల రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని, మాట తప్పితే మరో పోరాటం ఇంతకుమించి చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేసిన వీఓఏలపై సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు వివిధ పనుల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు. నల్లగొండ జిల్లాలో 44 రోజులపాటు మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా వీరోచితమైన పోరాటం చేసిన వీవోఏలందరికీ సీఐటీయూ జిల్లా కమిటీ పోరాట అభినందనలు తెలియజేస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో వీవోఏలంతా తమ హక్కుల కోసం ఐక్యమత్యంతో ఉద్యమించాలని చెప్పారు. చిలుముల దుర్గయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో జిల్లా నాయకులు భీమగాని గణేష్‌, వివిధ మండలాల యూనియన్‌ నాయకులు వై .కోటిరెడ్డి, పీ.సులోచన, కే.రేణుకా దేవి, జె. లలిత, టీ.సుమీల, తండు సైదమ్మ, ఎన్‌.సిరియాల, సిహెచ్‌.పుష్పలత, ఎం.వనిజ, వై.పద్మావతి, సిహెచ్‌.సైదులు, మమత, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love