విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోంది: ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్
నవతెలంగాణ-అచ్చంపేట
నీట్ పరీక్ష రద్దు పేపరు లీక్ అనే అంశం పై బొట్టు దుస్తులపై ఉన్న పెద్ద పేపర్ లీకేజీలపై లేదా విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహేష్ మంగళవారం ప్రకటనలో ఆరోపించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం చాలా దారుణమని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు.
(NTA) విద్యార్థులపై మాత్రం కఠిన నిబంధనలు అమలు చేస్తోందని, పరీక్ష కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యమైనా లోపలికి అనుమతించరని, బొట్టు, దుస్తులు, చెప్పులు, జుట్టు క్లిప్‌ల వరకు చెక్ చేస్తూ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కానీ అసలు ప్రశ్నాపత్రం ఎలా బయటకు వెళ్లింది..? పేపర్ లీక్ మాఫియాలు ఎలా యాక్టివ్ అయ్యాయి…? అనే విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
“విద్యార్థుల బొట్టు కనిపిస్తుంది కానీ పేపర్ లీక్ కనిపించదా…? దుస్తుల మీద శ్రద్ధ ఉంటుంది కానీ పరీక్ష భద్రత మీద ఉండదా..? సమయ నియమాలపై కఠినంగా ఉండే అధికారులు, పేపర్ లీక్ మాఫియాల ముందు ఎందుకు చేతులెత్తేశారు..?” అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతూ నీట్ కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలకు కోచింగ్‌లు పెట్టిస్తున్నారని, తమ పిల్లలు డాక్టర్లు కావాలనే ఆశతో ఎన్నో త్యాగాలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలు ఆడటం అమానుషమని అన్నారు.
పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతామని చెప్పడం సమస్యకు పరిష్కారం కాదని, ఇప్పటికే విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారని అన్నారు. ఒక పరీక్ష కోసం విద్యార్థులు నెలల తరబడి కష్టపడుతుంటే, కొందరు డబ్బు ఉన్న మాఫియాలు ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసి వ్యవస్థను అవమానపరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా వ్యవస్థపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందన్నారు. దేశంలో డిజిటల్ భద్రత, పారదర్శకత గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
నీట్ పేపర్ లీక్ ఘటనపై పూర్తి స్థాయి పారదర్శక దర్యాప్తు జరపాలని, బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడితే సహించేది లేదని, విద్యార్థుల హక్కుల కోసం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.



