– బీసీ కులగణనపై బీజేపీ వైఖరికి నిరసనగా జ్యోతిబా ఫూలే విగ్రహానికి వినతి
నవతెలంగాణ – కామారెడ్డి
బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో జ్యోతిబా ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో బీసీ కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిందన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న జాతీయ జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయకుండా, ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించకుండా, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించకుండా కులగణన నిర్వహించడం బీసీలకు అన్యాయం చేయడమేనని ఆరోపించారు. ఆగస్టు 17 నుంచి జాతీయ జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయని తెలిపారు. ఈ నెల 11న రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కాలమ్ కోసం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం, జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు మాత్రం న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో బీజేపీకి రాజకీయంగా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీసీలకు సమగ్ర న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మల్లన్న, ఒడ్డె ఎల్లన్న, విజయ్, నాగరాజు, హజీజ్, చాకలి రాజయ్య, వెంకటస్వామి, మహిళా అధ్యక్షురాలు బాజ లలిత, రమేష్, ప్రవీణ్, నవీన్, దయాకర్, రాజేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



