– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-ఆలేరు రూరల్
నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు.చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గుండ్లగూడెం,పటేల్‌గూడెం,శ్రీనివాసపురం గ్రామాల్లో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ఏసీ రెడ్డి నరసింహారెడ్డి,బొమ్మకంటి లక్ష్మీనర్సయ్య,గ్యార బాలయ్య,ఏంటిక రాములు,గ్యార సిద్దయ్య తదితరుల స్థూపాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారికి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజల మధ్య మత విభజనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు.
నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలో అనేక మంది భూస్వాములు,జమీందార్లు,జాగీర్దార్లు హిందువులే ఉన్నారని గుర్తుచేశారు.దోపిడీకి మతం లేదని,దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని స్పష్టం చేశారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని తెలిపారు.
అమరవీరుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని మల్లేశం సూచించారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ,అమరవీరుల ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం.ఏ. ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్యరాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్లమాస తులశయ్య, పిక్క గణేష్, మోరిగాడి రమేష్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, గణగాని మల్లేష్, చౌడబోయిన యాదగిరి, వడ్డేమాను బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్, మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ల ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదునూరి కిష్టయ్య, సోమక్క, గ్యార అండాలు, మిట్ట భిక్షపతి, చెక్కిళ్ల గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.



