Sunday, June 28, 2026
E-PAPER
Homeదర్వాజసామాన్యుని గోడు 'పిట్టగూడు'

సామాన్యుని గోడు ‘పిట్టగూడు’

- Advertisement -

కవితలోని ప్రతి పంక్తినీ కవితాత్మకంగా రాయాలని పరితపించే కవి తండ హరీష్ గౌడ్. ‘నీటిదీపం’ వెలిగించడం నుండి ‘పిట్టగూడు’ నిర్మించడం దాకా సాగిన అతని కవిత్వ ప్రయాణం అంత సామాన్యమైనదేమీ కాదు. రోజురోజుకూ వాక్యానికి కవిత్వాన్ని పులిమీ రసాత్మక పాదాలతో నిండైన కవిత్వాన్ని పండిస్తూ వస్తున్నాడు. ‘పిట్టగూడు’ అతని కవిత్వాన్ని మరో ఎత్తున మనకు చూపించే కవితా సంపుటి.
  వెనుక అట్ట మీది కవితతో సహా లెక్కేస్తే మొత్తం నలభై ఐదు వచన కవితల గుడ్లను పొదిగిన పుస్తకమీ పిట్టగూడు. పక్షి తన గూటిని గడ్డిపోచలు, ఎండుపుల్లలతో ఎంతో ఓపికగా, శ్రద్ధగా అల్లుకున్నట్లే, కవి తన ఈ కవితాగూటిని విభిన్న భావావేశాలతో, పదబంధాలు, అలంకారాలతో శ్రద్ధగా అల్లి, సుందరంగా రూపొందించాడు. ప్రకృతి, శ్రమ, మధ్యతరగతి జీవితాలు, మానవ సంబంధాలు, జీవిత సత్యాలు మొదలగు ఎన్నో అంశాల మీద రాసిన కవితలు ఈ గూటిలో చోటు చేసుకున్నాయి.
పుస్తకంలో ముందుమాటలు లేవుగానీ, ఓ రెండు కవితలకు మాత్రం ఆ కవితల తర్వాతి పేజీల్లోనే ఒకటి, ఒకటిన్నర పేజీలకు మించని సమీక్షలున్నాయి. ‘సమీకరణం’ కవితను అబ్దుల్ రజాహుస్సేన్ సమీక్షిస్తే, ‘ఒక చెట్టు – కొన్ని పక్షుల సమ్మేళనం’ కవితను పోతగాని సత్యనారాయణ సమీక్షించారు. రెండూ మంచి విశ్లేషణలే. అలాగే ‘ఇల్లు ఎక్కడికీ పోదు’ అనే కవితకు గణేష్ రామ్ చేసిన హిందీ అనువాదాన్నీ, ‘ఆ ప్రాంతమంతా’ కవితకు శరత్ బాబు చేసిన ఆంగ్లానువాదాన్నీ కూడా ఆయా కవితల తర్వాతి పేజీల్లోనే పొందుపరిచాడు కవి. మచ్చుకు కొన్ని కవితల్ని పరిశీలిద్దాం.
“వేపపువ్వులు/ భూమితల్లి శిరస్సు మీద/ అక్షతలు చల్లుతున్నాయి”, “మీసాలను మేలేస్తున్న మొక్కజొన్న కంకి/ ఆ చేను వైపుగా వచ్చిపోయే పిట్టలకు/ కన్ను కొడుతోంది” ఈ రెండు ఖండికలూ ఉగాది పండుగ సందర్భంగా రాసిన ‘వసంతమేఘ తాకిడి’ కవితలోనివి. వేపపువ్వుల్ని అక్షతలుగా, అవి రాలిపడ్డ నేలను భూమితల్లి శిరస్సుగా, కంకికి ఉండే పట్టును దాని మీసంగా పోల్చి చెప్పడం గొప్ప ఊహలు. ఎదిగిన కంకి పిట్టలను ఆకర్షిస్తుందనే సామాన్య విషయాన్ని “కంకి పిట్టలకు కన్ను కొడుతోంది” అంటూ కవిత్వీకరించడంలోనే కవి ప్రతిభను, ఊహాశక్తిని మనం అంచనావెయ్యొచ్చు.
ప్రపంచీకరణ భారతీయ కుటుంబ వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో మనకు తెలుసు. కుటుంబీకులంతా రకరకాల కారణాలతో తమ సొంతింటిని వదిలి వేరే ప్రాంతాలకు తరలిపోతున్న దుస్థితిని గమనిస్తూనే ఉన్నాం. చివరికి ఇంట్లో మిగిలిన ఒకరో ఇద్దరో ముసలివాళ్ళూ కాలం చేసేస్తారు. ఈ అంశాన్ని కవితా వస్తువుగా ఎంచుకొని ‘ఇల్లు ఎక్కడికీ పోదు’ కవిత రాసాడు కవి. ఇందులో “ఒకనాటికి ఎలాగో అలా/ ఇల్లు ఖాళీ అయిపోతుంది కానీ/ ఇల్లు ఎక్కడికీ పోదు/ మనుషులే/ గోడల మీద బొమ్మలయి వేలాడుతుంటారు” అన్నాడు. ఎవరూ అంత లోతుగా ఆలోచించని ఓ పెద్ద వాస్తవ విషయాన్ని మన కళ్ళ ముందు కవితాత్మక చిత్రంగా వేలాడగట్టాడు.
పర్యావరణ విధ్వంసాన్ని హరీష్ సహించలేడు. ఆ ఆవేదనలోంచి ఉబికిన కవితే ‘ఆ ప్రాంతమంతా’. ఆరు ఖండికలుగా రాయబడ్డ ఈ కవితలో మొదటి మూడు ఖండికల్లో తామరలు, గుట్టలను అద్భుతంగా వర్ణిస్తూ, వాటితో అలరారే ప్రాంతాన్ని ఆరోగ్యవంతమైన మనిషితో పోల్చాడు. తర్వాతి మూడు ఖండికల్లో తామరలు జె.సి.బి.ల నోటికి చిక్కి ఆహారమయ్యాయని, గుట్టలు పిండిపిండి అయ్యాయని, ఆ ప్రాంతమంతా రోగ -గ్రస్తమైపోయిందని వాపోతాడు. ఈ కవితలో ఒక ప్రాంతపు పూర్వ సుందరస్థితిని, ప్రస్తుత దుస్థితిని హృదయాన్ని కదిలించేలా కవితాత్మకంగా ఆవిష్కరించాడు.
మొత్తం సాహిత్యం విషయంలో సముద్రమనే వస్తువుది పెద్ద పాత్రే. సముద్రమనే పదాన్ని వాడకుండా సాహిత్యం సృజించని రచయితలుండరేమో! హరీష్ కవిత్వంలోనూ సముద్రముంది. ‘జీవితం C/O సముద్రం’ అంటూ రెండింటికీ లంకె పెట్టి ఓ గొప్ప జీవిత సత్యాన్ని ప్రబోధించాడు. మనిషిని మరిపించి, దుఃఖం నుండి విడిపించి, ఉపశమనం కలిగించడంలో సముద్రం తనకు తానే సాటని గుర్తుచేస్తాడు.
కాదేదీ కవితకనర్హమన్న శ్రీశ్రీ మాటను గట్టిగా పట్టుకొని, నమ్మి నడుస్తున్న కవి హరీష్. కవిత్వరంగంలో తన తొలినాళ్ళ నుండీ పూర్వకవులెవరూ స్పృశించని వస్తువుల మీద కవిత్వం రాస్తూ వస్తున్నాడు. భౌతిక వస్తువులు, పదార్థాల మీదనూ కవిత్వం రాసాడు. ఈ పిట్టగూడులోనూ అలాంటి కవితలున్నాయి. ‘ఎర్రని ఆకాశం’ అంటూ పుచ్చకాయ గురించి రాసిన కవితలో దాన్ని వర్ణిస్తూ “చేతుల్లో/ పచ్చపచ్చని భూమి/ లోపలంతా/ ఎర్రని ఆకాశం” అని చమత్కరించాడు. అలాగే ‘కీ’ అంటూ ఒక్క అక్షరపు శీర్షికతో బైక్ తాళంచెవి గురించి రాసాడు. కవితలో ఆద్యంతం కీ మనిషితో ఎలా ఆడుకుంటుందో భలే ముచ్చటగా చెప్తాడు. “చివరాఖరకు/ జేబులోనే తిష్టేసి/ వంకర పెదాలతో వెక్కిరిస్తది’ అనడం భలే చిత్రమైన ఊహ.
తనకు తెలుగు భాష మీదున్న మమకారంలోంచి ఓ కవితకు పురుడుపోసాడు. అందులో “కాయలన్నీ లూఠీ అయిన చెట్టయి/ పిట్టలెగిరిపోయిన గూడయి/ ఒంటరిగా నిలబడి చూస్తోంది/ కవుల సిరాచుక్కలతోనే/ కాస్తంత ఊపిరి పీల్చుకొని/ బతుకీడుస్తున్నది” అంటూ మాతృభాషకు ప్రస్తుతం పట్టిన దుర్గతిని వెల్లడిస్తూనే, భాషను నిలబెట్టడంలో కవుల పాత్ర గొప్పదని ప్రకటిస్తున్నాడు. మద్యపాన నిషేధానికి మద్దతు తెలుపుతూ రాసిన ‘మందుపాతరలు’ కవితలో “నువ్వు నమ్ముతున్న మందుసుక్కలు/ ఇంటిగోడల మధ్య చిచ్చుపెట్టే మందుపాతరలు/ నీ తలను తుంచిపడేసే వేటకత్తులు” అన్నాడు. మూడే మూడు అంత్యానుప్రాసల పంక్తుల్లో ఆలోచింపజేసే విషయాన్ని రేకెత్తించాడు. ఈ కవితను ఓ మంచి సందేశాత్మక కవితగా చెప్పవచ్చు.
ఆధునిక సాంకేతిక పదాలను వాడుతూ కవిత్వం రాయడంలో దిట్టగా పేరొందిన హరీష్ ఆర్థిక లావాదేవీలు కూడా మొబైల్ ఫోన్ ల ద్వారానే సునాయాసంగా క్షణాల్లో జరిగిపోతున్న విషయాన్ని ‘థాంక్యూ బాస్’ కవితగా రూపుదిద్దాడు. ‘ద్వేష ఖననం’ శీర్షికతో రాసిన కవితలో నిజమైన ప్రేమ ఎప్పుడు పుడుతుందనే విషయాన్ని చక్కగా వెల్లడించాడు.
ఎక్కడో దేశసరిహద్దుల్లో నిలబడి కాపలా కాసే సైనికతండ్రికి ఓ బిడ్డ హృద్యంగా లేఖ రాసినట్టుగానో, లోలోపల అనుకుంటూ మదనపడుతున్నట్లుగానో ఊహించి ‘నీ చుట్టే తిరుగుతున్నట్టుంది’ కవిత రాసాడు. ఆ కవిత మనసును మెలిపెట్టేస్తుంది.
2025 సంవత్సరంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమానప్రమాదంలో రెండువందల మందికి పైగా మరణించారు.
ఆ సందర్భంలో ఆ వార్త చూసి, దిగ్భ్రాంతికి గురైన కవి తన ఆవేదనను, తన సూచనలను ‘కాలం గీసిన మృత్యుచిత్రం’ కవితలో వెళ్ళగక్కాడు.
ఇప్పటి ఆధునిక హంగుల పొంగుల జీవితం కంటే ఒకప్పటి అందమైన జ్ఞాపకాల జీవితమే గొప్పదని ప్రకటిస్తూ ‘పురాజ్ఞాపకాలు’ కవితలో చెప్పాడు.
ఈ పుస్తకంలోని కవిత్వంలో పోలికలు అనేకానేకం. ఉపమాలంకార కవితా వాక్యాలు కోకొల్లలు. -‘పిట్టగూడు’ కవితలో పక్షిని ఇల్లు కోసం నక్ష గీసిచ్చే ఇంజనీరుతో, అక్షరాలను పోగేసి రాసుకొచ్చే పిల్లాడితో, ఇరువాలు దున్ని విత్తులు విత్తే రైతుతో పోల్చాడు కవి. ఓ కవితలో మధ్యతరగతివాడి జీతం డబ్బును జాలరులు వేటకెళ్ళి పట్టుకొచ్చే చేపతో పోల్చాడు. వాన గురించి రాసిన ఓ కవితలో మబ్బును తెల్లబూరు కుక్కపిల్లతో, వాన చినుకుల్ని అమ్మ జోలపాట చరణాలతో, ముసురును ముసుగుతన్ని పడుకున్న ముసలమ్మ ప్రాణంతో పోల్చాడు. ప్రతి శనివారం తెల్ల యూనిఫామ్ ధరించిన విద్యార్థులతో నిండి ఉండే తరగతి గదుల్ని పావురాల గూళ్ళతో పోల్చాడు. గాజాను నెత్తుటి సింధూరం ధరించిన అశ్రుదేవతగా, దుఃఖలోయగా అభివర్ణించాడు.
శాంతినిప్పు, ఉద్యోగచందమామ, నిచ్చెనకళ్ళు, చెమటపొక్కులదండ, కిరణాల కొరడా, అలలతాడు, ఆనందపిట్టలు, మబ్బులబుట్టలు, కాలుష్య జలగ, కనురెప్పల ఊయల ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో కొత్త పదబంధాలు, మెటాఫర్లను సృష్టించి ఈ కవిత్వంలోకి చొప్పించాడు కవి. తెలుగు సాహిత్యానికి కొత్త కొత్త రూపక సమాస పదాలనందించాడు.
హరీష్ ప్రకృతి ప్రేమికుడని, శాంతి కాముకుడని, యాత్రికుడని, శ్రమైక జీవన సౌందర్యాన్ని దర్శించగలిగేవాడని, సున్నిత మనస్కుడని ఈ సంపుటిలోని చాలా కవితలు మనకు చెప్పకనే చెప్పేస్తాయి.
అనుభూతుల్ని, అనుభవాలను, ఆవేదనను, నిరసనను ఇలా ప్రతీ ఉద్వేగాన్ని చక్కని అభివ్యక్తి, శిల్పంతో కవిత్వంగా మలిచి, తెలుగు సాహిత్యంలోకి జారవిడుస్తున్న హరీష్ పిట్టగూడు ఓ సామాన్యుని గోడులా సాహితీ చరిత్రలో నిలుస్తుంది.
కార్తీక రాజు, 8977336447

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -