టీఎస్పీఎస్సీ విశ్వసనీయత ప్రశ్నార్థకం

The credibility of TSPSC is questionable– కమిషన్‌పై అనేక సందేహాలు
– గ్రూపు-1 రద్దు వెనక్కి తీసుకోవాలన్న అప్పీల్‌పై హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌
పేపర్‌ లీకేజీ తర్వాత కూడా పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ విఫలమైందనే అభిప్రాయం బలంగా ఉందనీ, ఆ కమిషన్‌పై విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందని హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. దీనివల్ల లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌ ఆయోమయంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. నోటిఫికేషన్లలోని నిబంధనలను ఆ కమిషనే అమలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. నిబంధనలను అమలు చేయకపోవడంలోని అంతర్యం అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించింది. బయోమెట్రిక్‌ తీసుకోకపోవడానికి కారణాలు చెప్పాలని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఈ సందర్భంగా సర్వీస్‌ కమిషన్‌పై బెంచ్‌ అనేక ప్రశ్నలను సంధించింది. ఒకసారి పేపర్‌ లీకేజీ, పరీక్షల రద్దు తర్వాత రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షను సమర్థంగా నిర్వహించకపోవడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. గ్రూప్‌-4 పరీక్షలో మాత్రం బయోమెట్రిక్‌ తీసుకోవడం లేదని పేర్కొంటూ అనుబంధ నోటిఫికేషన్‌ జారీచేసినట్టుగా గ్రూప్‌-1 పరీక్షలకు కూడా ఎందుకు జారీ చేయలేదని నిలదీసింది. కౌంటర్లో పేర్కొన్న మొత్తం అభ్యర్థుల సంఖ్యకు, కమిషన్‌ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సంఖ్యకు ఎందుకు తేడా వచ్చిందని ప్రశ్నించింది. ఏకంగా 258 మంది ఎలా పెరిగిందని నిలదీసింది. అందులో దొడ్డి దారిలో వచ్చిన వారుంటే వాళ్లు కొన్నేండ్ల తర్వాత ఐఏఎస్‌ వంటి కన్ఫర్డ్‌ అధికారులు అవుతారని చెప్పింది. అలాంటి వారు నిర్ణయాలు తీసుకుంటే ప్రజల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించింది. కమిషన్‌ సుప్రీంకోర్టుకు వెళితే నియామకాలు తీవ్ర జాప్యం అవుతాయని గుర్తు చేసింది. రద్దు చేశాక తిరిగి పరీక్ష నిర్వహించేప్పుడు బయోమెట్రిక్‌ ఉండదని నోటిఫికేషన్‌ ఇస్తే అభ్యర్థులు ఏం చేయగలరని కూడా ప్రశ్నించింది. నోటిఫికేషన్‌ నిబంధన ప్రకారమే బయోమెట్రిక్‌ తీసుకోవాలని అభ్యర్థుల తరఫు న్యాయవాది చెప్పారు. 258 అభ్యర్థుల సంఖ్య పెరిగిందంటే వాళ్లంతా దొడ్డిదారిని నియామకాలు పొందితే ఏం కావాలన్నారు. నోటిఫికేషన్‌ నిబంధనలు సవరించే అధికారం కమిషన్‌కు ఉందని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. హాల్‌ టికెట్‌లో బయోమెట్రిక్‌ లేదని చాలా స్పష్టం ఉందనీ, ఆ వెంటనే కోర్టులో వ్యాజ్యం వేయకుండా పరీక్ష రాసిన తర్వాత కేసు వేశారని చెప్పారు. ఇది లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌తో ఆడుకోవడమేనని అన్నారు.. ఏ దశలోనైన నిబంధనలు మార్చే హక్కు కొత్త నిబంధనలు చేర్చడం, రద్దు చేయడం తది తర హక్కులు కమిషన్‌కు ఉన్నాయన్నారు. లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్న కారణంగా టెక్నికల్‌గా సమస్యలుంటాయనే బయో మెట్రిక్‌ అమలు చేయలేదని వివరించారు. బయోమెట్రిక్‌ విధిగా ఉండాలని లేదనీ, గతంలో యుపీఎస్సీ పరీక్షల్లో కూడా బయోమెట్రిక్‌ తీసుకోలేదని చెప్పారు. పరీక్ష జరిపిన రోజు ఫోన్‌ ద్వారా అందిన వివరాలు, తరువాత కచ్చితమైన వివరాలతో నివేదికల తయారీ వల్ల పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో మార్పులు వచ్చాయన్నారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు’ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహి స్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యం కనబడితే ఎలా’ అని కమిషన్‌ను ఉద్దేశించి ప్రశ్నించింది. బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదని కూడా నిలదీసింది. నిరుద్యోగు లతో అత్మహత్యలు చేసుకుంటున్నారనీ, అనర్హులు 100 మందికి అవకాశం లభిస్తే లక్షలాది అభ్యర్థుల ఆశలు ఏం కావాలని కూడా ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. గతంలో నిర్వహించిన పరీక్షలకు బయోమెట్రిక్‌ అమలు చేసినప్పుడు హాజరైన అభ్యర్థులు, అందుకు తీసుకున్న చర్యలు, ఇప్పడు పరీక్షా కేంద్రాల వారీగా వివరాలు నివేదించాలని కమిషన్‌ను ఆదేశించింది.

Spread the love