కార్మిక పోరాటాలకు రైతులు, ప్రజలందరూ అండగా నిలబడాలి
నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ సదస్సులో వక్తలు
పోరాటానికి సంఘీభావంగా సీఐటీయూ
రూ.లక్ష రూపాయల విరాళం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా-ఘజియాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో వేతనాలు పెంచాలనీ, పనిగంటలు తగ్గించాలని పోరాడుతున్న కార్మికులపైనా, యూనియన్ల నేతలపైనా అక్కడి బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని వీడనాడాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికవర్గ పోరాటాలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. నోయిడా కార్మికుల పోరాటానికి సంఘీభావంగా లక్ష రూపాయల నిధిని పంపిస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో నోయిడా కార్మికుల ఉద్యమానికి సంఘీభావ నిధి సేకరించాలనీ, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలోని ఎస్‌సీసీ పరిశ్రమలో గ్యాంట్రీ క్రేన్‌లు కూలి మృతి చెందిన ఐదుగురు కార్మికులు చనిపోవడం బాధాకరమనీ, బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలి డిమాండ్ చేస్తూ సదస్సులో తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో పెద్ద ఎత్తున ఆధునిక పరిశ్రమలున్నాయని తెలిపారు. తక్కువ వేతనాలు ఇవ్వడాన్నీ, కార్మిక చట్టాలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఏప్రిల్ 10,11 తేదీల్లో పెద్ద ఎత్తున రోడ్లమీదికొచ్చి దిగ్బంధించారని గుర్తుచేశారు. రూ.11వేలు నుంచి రూ.13 వేల జీతాలతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలా బతకాలో బీజేపీ పాలిత హర్యానా, యూపీ, రాజస్తాన్, ఢిల్లీ ప్రభుత్వాలు చెప్పాలని ప్రశ్నించారు. అంత తక్కువ వేతనానికి 12 గంటలు పనిచేయించడమేంటని నిలదీశారు. జీతాలు తక్కువ, 12 గంటల పనిగంటలు, తీవ్ర అణిచివేతను తట్టుకోలేకనే కాంట్రాక్ట్, క్యాజువల్, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఆ కార్మికులు రోడ్లెక్కి పోరాటాలు చేస్తున్నారన్నారు. హర్యానాలోని మనేసర్‌లో ప్రారంభమైన పోరాటం దేశ రాజధానికి విస్తరించిందన్నారు. కార్మికులను మనుషులుగా చూడని పరిస్థితులపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చెలరేగిందన్నారు. కార్మికుల సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిందిపోయి, నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపాలని బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు. సుమారు 500 మందిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారనీ, వారి వివరాలు కూడా వెల్లడించడం లేదని చెప్పారు.
సీఐటీయూ ప్రతినిధి బృందాన్ని కూడా అడ్డుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోనూ డిసెంబర్ 8,9,10 తేదీల్లో నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని షాహీ ఎక్స్‌పోర్టు కంపెనీలోని రెండు వేల మంది మహిళా కార్మికులు, శామీర్‌పేట్‌లోని హెచ్‌బీసీఎల్ కంపెనీలో కార్మికులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆ పోరాటాల్లో సీఐటీయూ అండగా నిలిచిందన్నారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు కంపెనీల్లో సమ్మెలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ.. నోయిడాలో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోందన్నారు. నిరుద్యోగం, పేదరికం, అసమానతలే ఈ పోరాటాలకు కారణమన్నారు. నోయిడా పోరాటం కార్మిక ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద 100 రోజుల పనిని పూర్తిగా అమలు చేయాలని, దీన్ని పట్టణ పేదలకు కూడా విస్తరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ మాట్లాడుతూ..నోయిడా కార్మికుల పోరాటానికి ఏఐకేఎస్ సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. కార్మికపోరాటాలకు తెలంగాణలో కూడా సంఘీభావ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి తిరుపతయ్య, వర్కింగ్ ఉమెన్ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావిద్, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్.రావు, జె. మల్లికార్జున్, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు కూరపాటి రమేష్, పి. సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె. కుమారస్వామి, యాటల సోమన్న, ఎ. సునీత, దశరథ్, నాయకులు గణేష్, కృష్ణ, ఉన్నికృష్ణ, ఎపిరాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.



