మొలకెత్తని సోయా విత్తనాలపై రైతుల ఆందోళన.. కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ – కుభీర్
సర్ పక్రియ ఫారాలు డిజిటలీకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కుబీర్ మండల కేంద్రంలో సర్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, గ్రామాల్లో ప్రతి ఓటరికి సర్ పక్రియ ఫారాలు అందించి, అందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా నింపించి సంబంధిత బీఎల్‌వోలకు అప్పగించేలా మండల సూపర్‌వైజర్లకు సూచించారు.
ఓటర్ల నుంచి అందిన ఫారాలను వెంటనే డిజిటలీకరణ చేసి గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా మండల కేంద్రం లోని ఓ ఇంటిని సందర్శించి సర్ ఫారాల వివరాలను పరిశీలించారు. ప్రతి ఇంటికీ వెళ్లి బీఎల్‌వోలు ఫారాల ప్రక్రియను పూర్తి చేసి, డిజిటలీకరణను వేగవంతం చేయాలని సూచించారు.
అనంతరం తేజస్వి కంపెనీకి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తక తీవ్రంగా నష్టపోయిన రైతులు కుబీర్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టర్ మండలానికి వచ్చిన విషయం తెలుసుకున్న రైతులు ఆయనను కలిసి తమ సమస్యను వివరించారు. మండలంలో నాసిరకం విత్తనాల వల్ల ఖరీఫ్ సాగులో భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల వినతిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత వ్యవసాయ అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు అవసరమైన మేరకు ప్రత్యామ్నాయ విత్తనాలు లేదా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించగా, కలెక్టర్ హామీతో రైతులు ఆందోళనను విరమించారు.ఆయన వెంట స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్,తాసిల్దార్ శ్రీదేవి, వ్యవసాయ శాఖ అధికారి సారిక,ఎంపీడీవో శ్రీనివాస్,ఎంపీ ఓ భీమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేష్, ఆయా శాఖలకు చెందిన అధికారులు రైతులు తదితరులున్నారు.



