భూమి మాట్లాడుతోంది..

స్వార్థ నరదిష్టికి నల్లరాయి కూడా నిట్టనిలువునా చీలుతుంది!
నరుడి కంట్లోపడ్డాక పచ్చటి భూమి
ఎర్రటి ఎడారి కాక ఏమవుతుంది?
పాదాల కింద నేలను విదిలించి
నెత్తిన శూన్య శోధనకు శిరోధారియై
కదిలినప్పుడే తల్లి గుండె కలుక్కుమంది
అనంత విశ్వానికి ఈ భూమి ఫలం
కాసి ఇన్నేళ్ళయినా దీని విలువ
తెల్సుకోడంలో మనిషి విఫలం కావడం విషాదమే!
మన చర్యలే ప్రతిచర్యలై ప్రతిధ్వనిస్తుంటాయి
మనిషి అడవులాక్రమిస్తే
మత్యువు మనిషి నాక్రమిస్తుంది
జీవజాతుల్ని కాలరాస్తే జీవవైవిధ్యం
నిర్జీవమై ప్రకతి పతనావస్థకు చేరుతుంది
మనం పాలు పోసి పెంచుతోన్న ప్లాస్టిక్కే
పామై కాలుష్యవిషం కక్కుతోంది…
నదులకు మొక్కిన చేతులే వ్యర్ధాల్ని
కలిపేసి భక్తికి అర్ధాల్ని మార్చేస్తోంటే…
కర్బన ఉద్గారాలు సంధించి ఓజోన్‌ కవచాన్ని
చీల్చి భావితరాల్ని నిరాయుధుల్ని చేస్తోంటే..
జీవ రసాయన, అణ్వాయుధాలు పక్కలో
పాముల్లా పడగలు విప్పి సిద్ధంగా ఉంటే…
నేల అంతమంటే ఆత్మహత్యా సదశ్యమని
మనుషులకు తెలియజేప్పాలనే భూమాత
నిత్యం కంపనతో హెచ్చరిస్తూనే వుంది..!!
(ప్రపంచ ధరిత్రి దినోత్సవం – ఏప్రిల్‌ 22)
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

Spread the love