పుస్త‌కం స‌మ‌స్త జ్ఞాన ప్ర‌వాహం

పుస్తక పఠనం లేకపోతే సమాజం కలంలేని, కాగితం లేని, మేధస్సు లేని విధంగా నిర్జీవ సమాజంగా సాగుతుంది. సమాజం పునర్జీవం పొందాలంటే పుస్తకాలను చదవాల్సిందే. పుస్తకాలు మనిషిలోని భావాలకు, ఊహలకు అక్షర రూపం ఇస్తాయి. మనల్ని కవులుగా, రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, సాహితీ వేత్తలుగా, మేధావులుగా తీర్చిదిద్దుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు. మనం కాలు కదపకపోయినా, ఇల్లు దాటకపోయినా కొత్త ప్రపంచలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను పంచి, మన పరిణతికి, మనో వికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు. మనకు సంతోషాన్నిచి, మన బాధను పంచుకునే చక్కని నేస్తాలు పుస్తకాలు. అటువంటి పుస్తక పఠనం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక గొప్పతనాన్ని తెలియజేసే వ్యాసం మీ కోసం…

యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ప్రతి ఏడాది చదవడం, ప్రచురించడం, కాపీరైట్లను ప్రోత్సహించడానికి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. సెవాంతెస్‌, షేక్సిపియర్‌, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616లో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్‌ ప్లా, వ్లాదిమర్‌, మారిస్‌ ద్రువాం ఇలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఓ కారణం. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహౌత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది.
రీడ్‌ యువర్‌ వే
ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 2024 థీమ్‌ ”రీడ్‌ యువర్‌ వే”. పుస్తక పఠనను ప్రోత్సహించడం, పెంపొందించడం అదేవిధంగా పుస్తక పఠనమనే అలవాటుగా మార్చడమే ఈ థీమ్‌ లక్ష్యం. అలాగే పిల్లలు, పెద్దలను ప్రోత్సహిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఫార్మాట్‌ లేదా జానర్తో (కథల, నవలల, పోయెట్రీనా, జీవిత చరిత్రలా, జానపద కథల) సంబంధం లేకుండా పుస్తకాలతో నిమగమయ్యే మార్గాలను సూచిస్తుంది. ఈ నాటిలా పుస్తకాలకు నిగనిగలాడే కవర్లు, మృదువైన పేజీలు అప్పట్లో ఉండేవి కావు. వేల ఏండ్ల కిందట చరిత్రపూర్వ నాగరికతలలో రాత వ్యవస్థలు అభివృద్ధి చెందనప్పుడు మట్టి పలకలను ఉపయోగించారు. పాపిరస్‌ తరువాత అనేక మందపాటి వెదురు పేజీలతో కుట్టిన ఆధునిక పుస్తకాలను పోలి ఉండేలా రూపొందించిన పుస్తకాలు ఉండేవి.
చదవడం ఓ కళ
శ్రవణం, భాషణం, పఠనం, లిఖితం అనే నాలుగు అభివ్యక్తి నైపుణ్యాలలో పఠన కళ ఒకటి. పుస్తకాలను చదవడం ఒక కళ. వేగంగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రారంభించి కొన్ని పేజీలు చదవగానే అది ఉపయోగపడేదేనా, కాలక్షేపానికా అన్నది గ్రహించగలగాలి. ఏది చదవాలి, ఎలా చదవాలి, ఏవి చదవకూడదు అనేది తెలిసి వుండటం కూడా పఠన కళలో భాగమే! ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాం, ఎంత లోతుగా చదివామన్నది ముఖ్యం. చదివిన ఒక వాక్యమైన క్షుణ్ణంగా, లోతుగా చదవాలి. అపుడే మన మనసులో అవి నిలిచిపోతాయి.
విద్యకు ప్రాతిపదిక పుస్తకం
ఒక ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఈ కింది సందేశం రాయబడి ఉంది. ‘ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే, ఆ దేశంపై అణు బాంబులు లేదా క్షిపణులు ప్రయోగించనవసరం లేదు. ఆ దేశ విద్యా విధానంలోని నాణ్యతను తగ్గించడం, పరీక్షల్లో విద్యార్థులు మోసం చేయడాన్ని అనుమతించడం చేస్తే చాలు. ఆ దేశ అభివృద్ధిని నాశనం చేయవచ్చు. అయితే ఆ దేశ అభివృద్ధి కొలమానంలో పుస్తక పఠనం, గ్రంథాలయాలు ఉన్నయన్న సంగతి మరవకూడదు. అభివృద్ధికి విద్య ప్రాతిపదిక అయితే విద్యకు ప్రాతిపదిక పుస్తకం. విజ్ఞానాన్ని సంరక్షించుకుని తరతరాలకు అందించటానికి ఎంతో ఉపయోగపడతాయి పుస్తకాలు. వైజ్ఞానిక, సంస్కృతిక, సాహితి రంగాలలో అభ్యుదయానికి పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుంది. పుస్తకాలకు బూజు పట్టకుండా ఉంచగలిగితే జాతి విజ్ఞానవంతమైన మేధోవంతమైన సమాజంగా వెలుగుతుంది.
ప్రపంచానికి వెలుగును చూపిస్తుంది
పిల్లలకు చిన్నతనం నుండే చదవడం అలవాటు చేయాలి. వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తిని రూపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాయశక్తుల ప్రయత్నించాలి. పుస్తకం అక్షర కృతి దాల్చిన ఆలోచనల సముదాయం. మూసిన పుస్తకపు అరలలో మరకతమణిలా, మిణుగురు పురుగులా ప్రపంచానికి వెలుగును చూపిస్తుంది. సామాజిక పరిస్థితుల దృష్య్టా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా పాఠకుడు పుస్తకం దగ్గరికి రానప్పుడు పుస్తకం పాఠకుని వెతుక్కుంటూ వెళ్ళాలి. పౌర గ్రంథాలయాల రూపంలో కానీ, పాఠశాల గ్రంథాలయాల రూపంలో కానీ లేదా పుస్తక ప్రదర్శన రూపంలో కానీ ఇది జరగాలి. కత్తికి పదును నిలిచి ఉండాలంటే అప్పుడప్పుడు దానికి పదును పెడుతూ ఉండాలి. లేకపోతే మొద్దు బారిపోతుంది. అదేవిధంగా నిత్యం చదువుతూ ఉన్న మనసు ఉత్తేజం కలిగించే ఆలోచన శక్తిని నిరంతరం పెంపొందించుతూ ఉంటుంది. లేకపోతే మనసు మందగతిగా మారి తెలివితేటలు లేకుండా పోతాయి. పుస్తక పఠనం మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది మెదడును నిమగం చేయడానికి, మానసిక కార్యకలాపాలను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
పుస్తకం వినోదానికా, వికాసానికా
పుస్తకాలు వికాసానికే చదవాలని కొందరు, వినోదానికే చదవాలని మరికొందరు వారి వారి అభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటారు. అయితే రెండు అభిప్రాయాలు సరికాదు. పుస్తకాలు చదువుకోవడం మనోవికాసానికో, వినోదానికో కాక విజ్ఞానానికి ఉపయోగపడతాయి. మానవ జీవితంలో వినోదం ఒక భాగమై పెనవేసుకున్నది. అయితే అది సభ్యమైనదై ఉండాలి. అన్నం తినేటప్పుడు నంచుకోవడానికి పచ్చళ్ళు అవసరమే. అయితే అన్నానికి మించి పచ్చళ్ళు ఉండరాదు. అందుచేత వికాసం మధ్య వినోదం నంజుకునేదిగా ఉండాలి. అంతేగాని అంతకు మించింది కారాదు. మనసు విశ్రాంతికి వినోదం కొంత పాలు అవసరమే. అయితే వినోదం కోసం చదివే పుస్తకాలు మన వికాసానికి కూడా దోహాదం చేసేవిగా ఉండాలి. కానీ మనసు ఉద్రిక్త పరిచేవిగా, మనసును బండ బారించేవిగా ఉండరాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితిలలో అకాడమిక్‌ పుస్తకాలే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల పురోభివృద్ధిలో, మనం చదువుకునేటువంటి విభాగంలో నూతన పోకడలు ఏమైనా వస్తున్నాయా, నూతన పరిణామాలు, నూతన ఆవిష్కరణలు వస్తున్నాయా అనే విషయాలు తెలుసుకోవాలంటే పుస్తకాలను చదవాల్సిందే, వాటిని అవగతం చేసుకోవాల్సిందే.
ఎటువంటి పుస్తకాలు చదవాలి
ప్రచురించబడిన ప్రతి పుస్తకం ప్రతి మనిషికి అవసరం లేదు. ‘కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి. కొన్ని జీర్ణించుకోవాలి. కొన్ని నెమరు వేసుకోవాలి’ అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల రయిత బేకన్‌. పుస్తకాలు ఎలా చవాలో మహాకవులు, మేధావుల జీవిత చరిత్రలు, డైరీల నుండి గ్రహించవచ్చు. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి మనందరకు తెలుసు. కానీ నేటి యువత పద్ధతి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. బాగా చదవివే అలవాటున్న వారిని పుస్తకాల పురుగు అంటారు. అలాంటి వారు నిజంగానే తమ డబ్బును బట్టలకు కాకుండా పుస్తకాలు కొనడానికి ఖర్చు చేస్తారు.
శాశ్వతమైన స్నేహితులు…
పుస్తకాలు చదవడం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు… ఇవి ప్రపంచాన్నే మార్చగలవు. ఆస్తులు, భవనాలు కూలిపోవచ్చు. కాని పుస్తకాలు నశించవు. అశాంతియ క్షణాల్లో, నిరాశా నిస్పృహల్లో, ఒంటరితనంలో పుస్తకమే మనకు నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దు:ఖాలలో మనకు తోడు. ఎంతో వెన్ను దన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు.
మంచి పుస్తకం మానవునికి ఎనలేని ఓర్పును అలవరుస్తుంది. లేని ఉల్లాసాన్ని వనగూర్చును. పుస్తకం అనేది ఊహాశక్తిని రేకెత్తించే పరికరం అని బెన్నెట్‌ మహాశయుడు చెప్పినట్లు గొప్ప వ్యక్తుల, రచయితల, సాహిత్యకారుల మదిలో వెలిగిన అక్షర రూపమే పుస్తకం. అటువంటి పుస్తకం అనేక ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. సిద్ధాంతాలను ప్రశ్నిస్తుంది, విలువలను కాపాడుతుంది, సమాజ మనుగడను, ప్రపంచ పోకడలను గ్రహించి, నూతన పరిణామాలను ఆవిష్కరించి సమాజానికి అందజేస్తుంది. మీ సహనానికి అనుగుణంగా ఎంత విజ్ఞానం ఉంటే అంత విజ్ఞానాన్ని జుర్రుకోవచ్చు. జ్ఞాన తృష్ణను పెంచే పుస్తకాలు చదివిన కొలది విజ్ఞత పెరిగి, ఆలోచన శక్తిని తీవ్రతరం చేస్తాయి.
క్రమం తప్పకుండా చదివితే…
పుస్తకం చదవడం వల్ల మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పొందడమే కాకుండా నడవడిక కూడా అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని అనేక పరిశోధనలలో తేలింది. కొంతమంది దృష్టిలో పుస్తకం చదవడం ఒక రకమైన కంఫర్ట్‌. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా తమ స్నేహితుడిని (పుస్తకాన్ని) తీసుకువెళతారు. పుస్తక పఠనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుస్తకం చదవకుండా రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. శరీర పోషణకు ఆహారపానీయాలు ఎలా అవసరమో అట్లే మెదడు పెంపొంది సమస్థితిలో ఉండాలంటే దానికి కూడా సరైన ఆహారం అవసరం అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శరీరాదరణకు అవసరమైన నిత్యక్రియలు ఏ విధంగా మన నిత్య జీవిత విధానాల్లో భాగమైపోతాయో అట్లే గ్రంథ పఠనం కూడా నిత్యజీవిత విధానంలో ఓ భాగమై పోవాలి. పది పూటలు గడగడ చదవడం కంటే ఒక పూటను చక్కగా అర్థం చేసుకొని చదవడం వలన ఎక్కువ విజ్ఞానం లభిస్తుంది.
ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి
పుస్తకాలను చదవడం అనేది మీరు తాదాత్మ్యతను, భావోద్వేగ మేధస్సును పెంపొందించుకోవడానికి, విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. విభిన్న పాత్రలు, కథాంశాలలో మిమ్మల్ని మీరు బహిర్గతం చేయడం ద్వారా, మీరు మానవ స్వభావం, భావోద్వేగాల గురించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. ఇది మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. పుస్తకాలు మీ ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి. దృశ్యాలు, పాత్రలను, అదృశ్యమానం చేయడంలో మీకు సహాయపడతాయి. ఇది పిల్లలకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారి సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. పఠనం మీ సొంత రచనను మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది. కమ్యూనికేషన్‌ గురించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు సంబంధిత అభిజ్ఞా క్షీణత ఆగమనాన్ని ఆలస్యం చేస్తుంది.
దృష్టిని, శ్రద్ధను మెరుగుపరచడంలో…
పుస్తకాలను చదవడం వల్ల విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణ నైపుణ్యాలు వృద్ధి చేసుకోవచ్చు. చదవడం ద్వారా వ్యక్తిగత, వృత్తి జీవితంలో వచ్చే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. విభిన్న దృక్కోణాలను అన్వేషించడానికి, ఇతరుల అనుభవాలను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ దృష్టిని, శ్రద్ధను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చదివే చర్య మెమరీలో సమాచారాన్ని ఎన్కోడ్‌ చేయడానికి కూడా సహకరిస్తుంది. ఇది తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం సులభం చేస్తుంది. వేగంగా పెరిగిపోతున్న వయసులో ఒత్తిడులు నుంచి తప్పించుకోవడానికి గొప్ప ఆధారం పుస్తకాలు.
మనిషిని శిల్పంలా మారుస్తుంది
భౌతిక పుస్తకాలతోనే కాదు డిజిటల్‌ పుస్తకాలతో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే భౌతిక పుస్తకాలు స్పర్శ అనుభవాన్ని అందిస్తాయి. డిజిటల్‌ పుస్తకాలు సౌకర్యవంతంగా, సులభంగా మనకు అందుబాటులో ఉంటాయి. అంతిమంగా అన్ని పుస్తకాలు ప్రయోజనాలను అందిస్తాయి. కానీ నాన్‌-ఫిక్షన్‌, ఎడ్యుకేషనల్‌ బుక్స్‌ వంటి కొన్ని శైలులు నేర్చుకోవడానికి, లోతైన ఆలోచన కోసం మరిన్ని అవకాశాలను అందిస్తాయి. ఈ రకమైన పుస్తకాలు పాఠకులకు కొత్త నైపుణ్యాలను పెంపొందిస్తాయి. పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని శిల్పంలా మారుస్తుంది. కనుక చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి. ప్రతి వారికి సొంత గ్రంధాలయం ఉండాలి. ఇది విలాసం కోసం, ప్రదర్శన కోసం కాదు. జీవితంలో ఇదీ ఒక అవసరం. మండల, జిల్లా, పాఠశాలల్లో పుస్తక పఠన(రీడథాన్‌) నిర్వహించాలి. పుస్తక పఠనం అనేది పాఠశాలల నుండి, గ్రంథాలయాల నుండి ఇంటికి ఎగబాకే సంస్కృతిని అలవరచాలి. పుస్తక పఠనం జీవితంలో నిత్యావసరంగా మారిపోవాలి. జీవితంలో మమేకమైనప్పుడు పుస్తకం ప్రధాయినగా వెలుగొందుతుంది.

Spread the love