షడ్రుచుల సమ్మేళనం..ఉగాది పర్వదినం..!

– తెలుగు వారి మొదటి పండగ నేటి నుంచే పలు పనులకు శ్రీకారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
షడ్రుచుల సమ్మేళనం.. ఉగాది పర్వదినం. ఇది తెలుగు ప్రజల ప్రత్యేక పండగ. ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టాలని భావించినా.. ఈ పండగ తర్వాతనే చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి నుంచే శుభకార్యాలకు శ్రీకారం చుడుతుంటారు. నేటి నుం చే నూతన వ్యవసాయ సాగును మొదలు పెడుతుంటారు. ఇలా ఈ పండగకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. నేడు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
తెలుగు వారిలో ఉగాది పండగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజు నుంచే నూతన పనులను ప్రారంభిస్తూ ఉంటారు. దాంతో మంచి ఫలితాలు వస్తుంటాయని అందరూ భావిస్తుంటారు. ఉగాది ప్రతీ సంవత్సరం చైత్రమాసం శుక్షపక్షంలో పాడ్యమి తిధి నాడు వస్తుంది. తెలుగు వారికి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారం భం అవుతుంది. ఉగాది పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది మన మొదటి పండగ. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారి మొట్ట మొదటి పండగ అంటారు. ఈ రోజు కొత్త సంవత్స రంలో రాశిఫలాలు, గ్రహస్థి తులు ఎలా ఉన్నాయో తెలుసు కుంటారు. పంచాంగ శ్రవణాన్ని పఠనం చేస్తారు. ఉగాది ఒక్క రోజు పండగ. తెలుగు ప్రజలు మాత్రమే కాక, మరా ఠీలు గుడి పడ్వాగా అనే పేరుతో, తమిళులు పుత్తాండుగా, మలయాళీలు విషుగా, సిక్కులు వైశాఖీగా, బెంగాలీలు పొరులా బైశాఖ్‌ అనే పేర్లతో ఈ నూతన సంవత్సర పండగని వైభవంగా నిర్వహిం చుకుంటారు.
ఉగాది అనే పదం ‘ఉగస్య’ అనే పదం నుంచి ఏర్పడిం ది. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని కూడా అర్థాలు ఉన్నాయి. ‘ఆది’ అంటే మొదలు లేదా ప్రారంభం అని అర్థం. అంటే ఉగాది ప్రపంచం జన్మ, ఆయుష్షులకు మొదటి రోజు కావడంతో ఉగాది అయ్యింది. మన దేశ ఆచార, సాంప్రదాయాల ప్రకారం చైత్ర శుక్ష పాఢ్యమి అంటే ఈ ఉగాది రోజునే సృష్టి ఆవిర్భావం జరిగిందని పురాణాల ఆధారంగా చెబుతుంటారు.
ఈ ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. ఈ మాసంలో పక్షుల కిలకిలతో, ఆకులు చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో పచ్చదనంతో, అందంగా కొత్తగా ఈ ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందం ప్రత్యక్షంగా, పరోక్షంగా, కవి కాలంలో, ఉగా ది పాటల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఈ పండగ రోజు ప్రజలు చక్కగా తెల్లవారే నిద్రలేచి ఇల్లు, పరిసరాలను శుభ్రప ర్చుకుని, మామిడి తోరణాలతో అలంకరించి, తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అన్నింటి కంటే ఈ రోజు ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిని వివిధ ప్రాంతాల వారు వివిధ రకాలుగా చేసుకుంటారు. అయితే ఇందులో ప్రత్యేకమైనవి షడ్రుచులు. మధురం, కషాయం, ఆమ్లం, అవణం, కటు, తిక్త. ఇలా ఈ ఆరు రుచులు ఉగాది పచ్చడిలో ప్రధానమైనవి. ఈ ఆరు రుచుల్లో మొదటిది మధురం అంటే తీపి. రెండోది ఆమ్లం అంటే పులుపు, మూడోది లవణం అంటే ఉప్పు, నాలుగోది కటు అంటే కారం. ఐదోది తిక్త అంటే చేదు. ఆరోది కషాయం అంటే వగరు లాంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. అందరూ ఒకేలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ పచ్చడిని తయారు చేస్తారు. అయితే ఈ పచ్చడిలో చెరకు వంటి పండ్లు, మామిడి కాయలు, చింతపండు, వేప పువ్వు, జామ కాయలు, బెల్లం వగైరా పదార్థాలను వాడుతారు.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచు లతో తయారు చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అనేది మొత్తంగా అన్నీ అను భవాలు కలిగినదైతేనే అర్థవంతం అవుతుందని తెలిపే భా వం ఇందులో ఇమిడి ఉంటుంది. కాబట్టి పచ్చడిలో ఉండే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభూతికి ప్రతీకలు.
ఉత్సాహంగా సమ్మేళనాలు
ఉగాది పండగను పురస్కరించుకుని ప్రతి ఏడాదీ కొన్ని సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళ నాలు, అష్టావధానం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో కవి సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు కవులను ఘనంగా సన్మానిస్తూ ఉంటారు.

 

Spread the love