అజంజాహి మిల్లు కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

నవతెలంగాణ-కాశిబుగ్గ
ఆజంజాహి మిల్లు కార్మికులకు మిల్లు స్థలంలో ఇంటి స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కార్మిక సంఘ నాయకులు అన్నారు. మంగళవారం అఖిల కార్మిక సంఘాల సమావేశం సిఐటియు జిల్లా నాయకుడు ఇనుముల శ్రీనివాస్‌ అధ్యక్షతన ఎల్బీనగర్‌ లోని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కష్ణ, సిఐటియు జిల్లా నాయకుడు నాగపురి వెంకటేశ్వర్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌, ఏఐసిటియు రాష్ట్ర నాయకుడు నర్రా ప్రతాప్‌, బిఎం ఎస్‌ జిల్లా నాయకుడు మచ్చ రాజు, ఏఐఎస్టియు నాయ కులు కొండన్న, శ్యామ్‌, సంజీవ మాట్లాడుతూ మిల్లు స్థలం లోనే కార్మికులకు పట్టాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న ప్పటికీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కార్మికులను మోసగించి నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని మడిపల్లిలో ఫ్లాట్లు ఇస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆజంజాహి మిల్లు కార్మికులకు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేయుటకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి, యువజన, మహిళా, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Spread the love