బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజకీయాలపై కార్టున్ల ప్రభావం గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్-2026 ప్రధానోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆర్‌కే. లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమన్నారు. అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హాబ్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. రెండు దశాబ్దాల పాటు కార్టూనిస్టుగా శేఖర్ విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. సమకాలీన అంశాలపై ఆయన వేసిన కార్టూన్లు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శేఖర్ గీసిన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాయని గుర్తు చేశారు. శేఖర్ ప్రస్థానం నేటి తరం కార్టూనిస్టులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలుగులో ఎంతో మంది కార్టూనిస్టులు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను తమ కుంచెల ద్వారా ఆవిష్కరించారని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనవేననీ, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి అవసరమని పేర్కొన్నారు. జీవితంలో గెలుపోటములు సహజమనీ, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని అన్నారు. ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని చెప్పారు. కార్టూన్ విభాగంలో ఎం. నారు, ఆర్టిస్ట్ విభాగంలో కూరెళ్ల శ్రీనివాస్‌లకు ఈ సందర్బంగా కేటీఆర్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియెట్ ప్రొఫెసర్ ఎన్.రఘు, ప్రొఫెసర్ బెల్లి యాదయ్య, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేశ్, శేఖర్ కుటుంబ సభ్యులు, పలువురు కార్టునిస్టులు, చిత్రకారులు పాల్గొన్నారు.
రాజకీయాలపై కార్టూన్ల ప్రభావం గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



