రాజధాని భూముల కుంభకోణం కేసులో దర్యాప్తు వేగవంతం

– సుప్రీంకోర్టు స్టే తొలగింపుతో మళ్లీ రంగంలోకి సిఐడి
–  మాజీ మంత్రి నారాయణ, పలువురు టిడిపి నేతల ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాలు అటాచ్‌
గుంటూరు : రాజధాని భూముల కుంభకోణం కేసులో ఉండవల్లి కరకట్టపైనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సిఐడి జప్తు చేసింది. మాజీ మంత్రి నారాయణ సహా పలువురు టిడిపి నేతల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు అటాచ్‌ చేసింది. రాజధాని రాక ముందు అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి వైసిపి ప్రభుత్వం నియమించిన సిట్‌ (సిఐడి) దర్యాప్తు వేగం పుంజుకుంది. చంద్రబాబుపై దాఖలైన కేసుల దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీం కోర్టు ఇటీవల తొలగించడంతో సిఐడి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలపై పలువురి ఆస్తుల జప్తు ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ 1944 చట్టం ప్రకారం ఆస్తులు, బ్యాంకుల్లోని నగదు జప్తు చేసినట్టు ప్రకటించారు. క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న అభియోగాలపై చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణలతోపాటు పలువురిపై సిఐడి దర్యాప్తు జరుగుతోంది. సిఆర్‌డిఎ మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్లలో అవకతవకలు జరిగాయని, అధికార పదవులను ఉపయోగించుకుని తమ బంధువులు, స్నేహితులకు, టిడిపి వారికి మేలు చేశారని సిఐడి అభియోగాలు మోపింది. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని కరకట్ట వద్ద ఉన్న లింగమనేని ఎస్టేట్‌ అతిథి గృహం (చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసం)తో పాటు పలువురి ఆస్తులను జప్తు చేసింది. రాజధాని ప్రాంతంలో తనకు అనుకూలంగా అలైన్‌మెంట్‌ మార్చినందుకు క్విడ్‌ ప్రోకో కింద చంద్రబాబుకు ఈ అతిథి గృహాన్ని లింగమనేని సంస్థ అధినేత రమేష్‌ బహుమతిగా ఇచ్చారనేది సిఐడి ఆరోపణ. దానిని జప్తు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో లింగమనేని రమేష్‌కి లబ్ధి చేకూరే విధంగా రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చారని, చిన్న రైతులకు నష్టం చేస్తూ లింగమనేనితోపాటు చంద్రబాబు సొంతమనుషుల ఆస్తుల విలువ పెంచే విధంగా రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ మార్చారనేది సిఐడి అభియోగం. హెరిటేజ్‌ డైరెక్టరుగా ఉన్న అప్పటి మంత్రి నారా లోకేష్‌… లింగమనేని రమేష్‌ నుంచి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని అభియోగం మోపింది. నారా లోకేష్‌తోపాటు పలువురు టిడిపి నాయకులు రాజధాని ప్రాంతంలో బినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు వైసిపి నాయకులు సిఐడికి గతంలో ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలోని స్టార్ట్‌ అప్‌ ప్రాంతంలో రూ.3.66 కోట్లతో 2015 జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో బినామీ పేర్లతో భూమి కొనుగోలు చేశారని అప్పటి మంత్రి నారాయణపై అభియోగం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు చెందిన నారాయణ విద్యా సంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్‌ రాపూరు సాంబశివరావు పేరుతో ఉన్న ఆస్తులను సిబిఐ జప్తు చేసింది. రాజధాని గ్రామాల్లో నారాయణతోపాటు ఇతరులకు చెందిన మొత్తం 75,880 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు జప్తు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిలో ఉద్దండరాయునిపాలెంలోని 2,040 గజాల రెండు ప్లాట్లు, రాయపూడిలోని 18,140 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు ఉన్నాయి. లింగాయపాలెంలో 12,440 గజాల ప్లాట్లు, మందడంలో 39640 గజాల ప్లాట్లు జప్తు చేశారు. కొండమరాజుపాలెంలో 3,180 గజాల ప్లాట్లు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్‌ ఎండి కెపివి అంజనీకుమార్‌కు చెందిన రాయపూడిలోని రెండు ఎకరాల భూమిని, పలువురి బ్యాంకు ఖాతాల్లోని రూ.1,92,11,482 నగదును సిఐడి జప్తు చేసింది. హైదరాబాద్‌ చందానగర్‌ బ్రాంచిలో పొట్లూరి ప్రమీలకు చెందిన రూ.40.88 లక్షలు, రాపూరి సాంబశివరావుకు చెందిన రూ.60.94 లక్షలు, వివిధ బ్యాంకుల్లో ఆవుల శంకర్‌కు చెందిన రూ.69,16502, కె.వరుణ్‌కుమార్‌ పేరిట ఉన్న రూ.21,11,660 జప్తు చేసిన వాటిలో ఉన్నాయి.

Spread the love