– కార్మికులకు అన్నివిధాల అండగా ఉంటాం
– కార్మిక చట్టాలమలయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలి : తోట చంద్రశేఖర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గంగవరం పోర్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించకుండా వారి జీవితాలతో యాజమాన్యం చెలగాటం ఆడుతున్నదని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మికులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పోర్టు నిర్మాణంతో వేటకు దూరమైన మత్స్యకారుల కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులో కార్మిక చట్టలను అమలు చేయాలని ప్రశ్నించిన 29 మంది కార్మికులను లక్ష్యంగా చేసుకొని యాజమాన్యం వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని పేర్కొన్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోర్టు యాజమాన్యం వ్యవహరించడం దుర్మార్గమని తెలిపారు. విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు.