నిమిషం నిబంధన ప్రాణం తీసింది!

The minute rule took life!– సాత్నాల ప్రాజెక్టులో దూకి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య
– క్షమించు నాన్న అంటూ సూసైడ్‌ నోట్‌..
– ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాంగుర్ల గ్రామంలో
నవతెలంగాణ- జైనథ్‌
ఇంటర్‌ పరీక్షల్లో ప్రభుత్వం విధించిన నిమిషం నిబంధన ఓ విద్యార్థి ప్రాణం తీసింది. సమయానికి వెళ్లి పరీక్ష రాయలేకపోయాననే మనస్థాపంతో సాత్నాల ప్రాజెక్టులో దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాంగుర్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్‌ మండలం మాంగుర్లకు చెందిన టేకం రాములు, పంచపూల దంపతుల కుమారుడు శివకుమార్‌(17) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో తనకు కేటాయించిన పరీక్ష కేంద్రమైన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. అప్పటికే పరీక్షా సమయానికి మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో నిమిషం నిబంధనతో లోపలికి అనుమతించరనే కారణంతో పరీక్షా కేంద్రానికి చేరుకుండానే తిరుగుముఖం పట్టాడు. పరీక్ష సమయానికి కేంద్రానికి చేరుకోలేక పోవడంతో మనస్తాపానికి గురైన శివకుమార్‌.. తన గ్రామ సమీపంలోని సాత్నాల ప్రాజెక్టులో దాకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరీక్ష మిస్‌ అయినందుకు తనను క్షమించాలంటూ తండ్రికి అతను రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రాజెక్టు ఒడ్డున లభించింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పలు విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు స్పందించారు. నిమిషం నిబంధన తొలగించాలని డీఐఈఓ రవీందర్‌కు వినతిపత్రం అందించారు.

Spread the love