పోలింగ్ పై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి


– సహాయ రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్
నవతెలంగాణ – రామగిరి: పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలపై పోలింగ్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం మంథని శాసనసభ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి వి హనుమా నాయక్ అన్నారు. గురువారం రామగిరిమండలంలోని జే.ఎన్.టి.యు.హెచ్.. యూనివర్సిటి కళాశాల, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గల పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హనుమా నాయక్ మాట్లాడుతూ.. మే 13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
గతంలో అనేక మార్లు పోలింగ్ విధులు నిర్వహించినప్పటికీ ప్రతి ఎన్నిక ప్రత్యేకంగా ఉంటుందని, కొత్త నిబంధనలు వస్తుంటాయని, అధికారులేవరూ నిర్లక్ష్యం వహించకుండా పోలింగ్ నిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. పోలింగ్ అధికారులు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని, మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత వీవీప్యాట్ లో స్లిప్పులను తొలగించాలని తెలిపారు. సి.ఆర్.సి తప్పనిసరిగా చేయాలని, పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో తప్పనిసరిగా క్లోజ్ బటన్ నొక్కాలని వివరించారు. పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోద వుతున్న పోలింగ్ శాతం వివరాలను సెక్టార్ అధికారులకు అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టు లు అందజేయాలని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహశీల్దార్లు ఎం.డి. ఆరీఫ్ ఉద్దీన్, ఎ. నాగరాజు, బి.రాంచందర్, డి. రాజయ్య, మాస్టర్ ట్రైనర్లు, పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love