నవతెలంగాణ – గోవిందరావుపేట
పైపులను మరమ్మత్తులు చేయాలని విజ్ఞప్తి గత వారం రోజులుగా త్రాగునీరు అందక పసర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం నీటి అవసరం ప్రతి ఇంటికి అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజులు త్రాగునీరు అందకపోతే ఆ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది అనేది ప్రజా ప్రతినిధులకు పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. గత వారం రోజుల క్రితం 163 జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రోక్లైన్ తో పనులు తోడుతున్న క్రమంలో మూడు ప్రదేశాల్లో పైపులైన్ దెబ్బతింది. మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బతిన్న ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. వారం రోజులుగా త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న గ్రామపంచాయతీ సర్పంచ్ కానీ అధికారులు కానీ స్పందించకపోవడం దురదృష్టకరం అంటున్నారు. సమీప కుటుంబీకుల బోర్లను ఆశ్రయిద్దాం అన్నా కూడా బోర్లు కూడా అడుగంటిపోయాయి భావులలో చుక్క నీరు లేదు ఇలాంటి పరిస్థితుల్లో నరకయతన అనుభవిస్తున్న సర్పంచ్ పంచాయతీ పాలకవర్గం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని అంటున్నారు. సంబంధిత గుత్తేదారుపై చర్యలు చేపట్టడం లేదు సరి కదా కూలీలను సిబ్బందితోనూ పైపులైన్లు మరమ్మతు చేయించకుండా ప్రజల కష్టాలను చూస్తూ సంతోషంగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారని ప్రజలు అంటున్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు అంటూ ప్రకటన చేస్తున్న నాయకులు అధికారులు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా పైపులైను దెబ్బతిన్న క్రమంలో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ సంఘటనలను గుర్తుంచుకొని పునరావృతం కాకుండా చేయాల్సింది పోయి పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. తాగునీటి కోసం 163 వ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేపడతామని మహిళలు అంటున్నారు. త్రాగునీటి ఇబ్బందులు ఇంత దుర్భరంగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అడ్రస్ లేకుండా తిరుగుతున్నారని అంటున్నారు. ఫోన్ ద్వారా సంప్రదించిన ఎలాంటి సమాచారం ఉండటం లేదని ప్రజలు అంటున్నారు. మళ్లీ ఓట్ల కోసం వచ్చినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తామని అంటున్నారు. క్రమం తప్పకుండా పనులు చెల్లిస్తున్న పంచాయతీ అధికారులు త్రాగునీటి సమస్యపై స్పందించకపోవడం విచారకరమని అంటున్నారు. నీరు లేక కుటుంబమంతా ఇబ్బంది పడుతున్నాం.
జాల వెంకన్న పసర
గత వారం రోజులుగా పైప్ లైన్ నీరు రాకపోవడం వల్ల కుటుంబం అంతా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబంలో చిన్న పిల్లలు కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకవర్గం ఉన్న లేకున్నా ఒకటే. ఎండాకాలంలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉంటే అన్ని ఇబ్బందులు ఉంటాయో అనుభవించిన వారికి తెలుస్తుంది. సామాన్య ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సర్పంచ్ గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి వెంటనే పైప్ లైన్లను మరమ్మత్తు చేసి త్రాగునీటిని అందించాలని కోరుతున్నాం లేనియెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.