చదువులకు పేదలు దూరం

చదువులకు పేదలు దూరం

– నూతన విద్యా విధానంపై విద్యావేత్తల ఆందోళన
– వర్సిటీలు ప్రజా ఉద్యమాలతో మమేకం కావాలని పిలుపు
న్యూఢిల్లీ : నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ), యూనివర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) కారణంగా అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమవుతారని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాల వారికి విద్య అందని ద్రాక్ష అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సంక్షోభంలో ఉన్నత విద్య’ అనే అంశంపై జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కేంద్ర విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య (ఫెడ్‌క్యూటా) ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు వందలాది మంది విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూజీసీ మాజీ చైర్మెన్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌ ప్రసంగిస్తూ పేద విద్యార్థులు, విద్యార్థినులు, దళితులు, ఆదివాసీలు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు దూరమై పోతారని చెప్పారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మాజీ డీన్‌ అనితా రాంపాల్‌ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్రంలోని పెద్దల అధికార దర్పం కారణంగా ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు తమ స్వతంత్రతను కోల్పోతాయని అన్నారు. విద్యార్థుల అవసరాలు కేంద్ర పాలకులకు అర్థం కావని చెప్పారు. మధ్య తరగతి వారిని ఎలా బుట్టలో వేసుకోవాలో నూతన విద్యా విధానానికి తెలుసునని వ్యాఖ్యానించారు. సెకండరీ స్థాయిలో ప్రస్తుతం ఐదు కోర్సులు మాత్రమే ఉన్నాయని, నూతన విద్యా ప్రణాళికలో 16 కోర్సులను చేర్చారని అంటూ పలు రాష్ట్రాలలో జరిగిన బోర్డు పరీక్షలలో యాభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారని తెలిపారు.
విద్యార్థుల సమ్మెను పరిష్కరించాలంటూ అధికారులకు లేఖ రాసిన పాపానికి సస్పెన్షన్‌కు గురైన దక్షిణాసియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రవి కుమార్‌ ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు బలహీనంగా మారాయని చెప్పారు. సమాజం కులం, మతం ప్రాతిపదికన వ్యవహరిస్తే విశ్వవిద్యాలయాలు కూడా అదే దారిలో నడుస్తాయని అన్నారు. ఫీజుల పెంపుదలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో జేఎన్‌యూపై దాడులు పెరిగాయని గుర్తు చేశారు. ‘జామియా ఉపాధ్యాయ సంఘాన్ని సస్పెండ్‌ చేశారు. మమ్మల్ని కూడా సస్పెండ్‌ చేశారు. అయినప్పటికీ రెక్టార్లుగా పనిచేస్తున్న మా సహచరులు మౌనం వీడలేదు. విశ్వవిద్యాలయాలు తమ ప్రజాస్వామిక స్వభావాన్ని తిరిగి పొందాలంటే మేము ప్రజా ఉద్యమాలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. మణిపూర్‌ హింసను, దళితులపై జరుగుతున్న దాడులను యూనివర్సిటీలు ఖండించాలని, ఇందుకోసం అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు ప్రజలతో కలిసిపోవాలని అంటూ మెక్సికో ఆందోళనను ప్రస్తావించారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాఠశాల విద్యకు హాని కలిగిస్తుందని, విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా ప్రవేశ పరీక్ష కోచింగ్‌పై దృష్టి సారిస్తారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవేశ పరీక్షలో ఎక్కువగా సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారని, ఇది రాష్ట్ర బోర్డుల విద్యార్థుల ను నిరుత్సాహపరుస్తుందని ఢిల్లీ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌ చెప్పారు. యూజీసీకి పూర్తి స్వతంత్రత లేదని ఆయన అన్నారు.

Spread the love