ఓ సాధారణ కార్యకర్తగా ప్రారంభమై కమ్యూనిస్టు నేతగా శిఖరాగ్రానికి చేరిన ఆరు దశాబ్ధాల ఆయన ప్రయాణం అనేక అనుభవాల సారం. ఎన్ని చీలికలు..! ఎన్ని విద్రోహాలు..! ఎన్నెన్ని విచ్ఛిన్నాలు..! ఈ సంక్షోభాలన్నిటా పార్టీని కాపాడుకోవడానికి మొక్కవోని ధైర్యం, ఉక్కు సంకల్పంతో ఆయన చూపిన నిర్మాణదక్షత అమోఘమనిపిస్తుంది. అది ఎంతటి ఆపత్కాలమైనా అధైర్యపడకుండా నడుస్తూ నడిపించిన ఆయన సారధ్యం అద్భుతమనిపిస్తుంది. నిర్బంధాలూ, విచ్ఛిన్నాలు ఉద్యమాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు.. సహచరులే ప్రత్యర్థులుగా మారి ఎదురుదాడి చేస్తున్నప్పుడు.. అంతులేని సంఘర్షణకు గురవుతూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోని గుండెనిబ్బరమతడు. మిన్ను విరిగి మీద పడ్డా చలించక.. జయాపజయాలను సమానంగా భావిస్తూ సాగిన జైత్రయాత్ర అతడు. ఆయన ఉద్యమ జీవితంలోని వివిధ దశల్లో ధర్మబిక్షం, భీమిరెడ్డి నరసింహ్మారెడ్డి, ఓంకార్‌లను తన గురువులుగా చెప్పుకుంటారు వి.ఎన్. కానీ చీలికలు, విచ్ఛిన్నాలనుండి పార్టీని కాపాడుకునే క్రమంలో ఈ ముగ్గురినీ ఎదురించడానికాయన వెనుకాడలేదు. ఆయన సైద్ధాంతిక నిబద్ధత ముందు, కర్తవ్యదీక్ష ముందు వ్యక్తిగత అనుబంధాలు, బంధుత్వాలు చాలా స్వల్పమైనవని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.
వెండిమబ్బుల్లాంటి తేజస్సు…
నిండు పున్నమిలాంటి మేధస్సు…
నవ్వితే వెన్నెల… నడిస్తే వేకువ…
మొత్తానికి ఆయన లోపలా బయటా తెల్లదనమే…
తలపై సుద్దరేణువుల్లా ఒత్తైన శిరోజాలూ, ఒంటిపై మల్లెపువ్వుల్లా దవళ వస్త్రాలూ స్వచ్ఛతకు ప్రతీకల్లా నిత్యం పోటీపడుతుంటే.. నిర్మలమైన మంచుకొండలా తెల్లగా కనిపించే ఎర్రని సింధూరమతడు. ఆజానుబాహుడు.. అంద గాడు. నాణానికి బొమ్మా బొరుసులా సౌమ్యుడూ సాహసీ..! ఆత్మీయులు వి.ఎన్. అని పిలుచుకునే మల్లు వెంకటనర్సింహారెడ్డి గుర్తుకు రాగానే మదిలో మెదిలే సదృశ్యమిది.
ఒకవైపు నిజాం నిరంకుశ పాలన, మరోవైపు భూస్వాముల పీడన.. తెలంగాణ కటిక చీకట్లో మగ్గుతున్నప్పుడు ఓ కాంతిరేఖలా కన్నుతెరిచాడాయన. పుట్టింది మామిళ్లమడువ.. పెరిగింది పోరాటాల పొత్తిళ్ల నడుమ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన వి.ఎన్. ఆటపాటల్లో మేటి. చదువుల్లో తనకు తానే సాటి. సాధారణ రైతు కుటుంబమే అయినా, తండ్రి ఎర్రబాడు దేశ్‌ముఖ్‌ల జాగీరులో మునసబు కావటంతో కావల్సినన్ని అవకాశాలు… ఇంకేం.. పెద్ద చదువులు చదివి ఉద్యోగంలో చేరి ఉన్నతస్థాయికి ఎదుగుతాడని భావించారందరు. కానీ ఆయన అంతకంటే అత్యున్నత స్థాయికి ఎదిగి వారిని నిరాశపరిచాడు..! పుస్తకాలతో పాటే సమాజాన్ని కూడా చదవడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో.. తన చుట్టూ ఉన్న వ్యవస్థ దుర్గంధాన్ని భరించలేకపోయాడు. ఎందుకంటే, ప్రపంచం మహోన్నత మార్పులకు పురుడు పోస్తున్న కాలంతో కలిసి పెరిగాడాయన. ఆ నేపథ్యమే అయనలో ప్రగతిశీల భావాలకు ఊపిరి పోసింది. విద్యార్థి దశలోనే విప్లవకారుడిగా మలిచింది. సూర్యాపేట కేంద్రంగా స్వాతంత్రోద్యమానికి మద్దతుగా, నిజాంకు వ్యతిరేకంగా పెద్ద విద్యార్థి ఉద్యమాన్ని నడిపాడు వి.ఎన్. సూర్యాపేటలో హైస్కూల్ సాధనకోసం పట్టుదలగా పోరాడాడు. కానీ అది సాకారమయ్యే నాటికే ఆయన తెలంగాణ పోరాట నేతలకు కొరియర్‌గా ఓ రహస్య జీవితాన్ని ప్రారంభించాడు. రాత్రుళ్లు కొరియర్‌గా, పగలు విద్యార్థిగా సాగుతోంది జీవితం…
అవి తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభ దినాలు.. రహస్య నాయకత్వానికి కొన్ని ఉత్తరాలు అందించేందుకు స్కూల్ ముగిసాక చందుపట్లకు బయలుదేరాడు వి.ఎన్. వెలుతురు మాయమవుతుండగా చేరాడా ఊరికి. కానీ ఈ ఉత్తరం ఇవ్వాల్నింది తమకు కాదు తిమ్మేపురంలో ఉన్న నాయకత్వానికని చెప్పారు వారు. అప్పటికి చుట్టూ చీకటి దట్టంగా అలుముకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లేఖలు ఆ రాత్రికే వారికి చేరాలి. పట్టుదలగా బయలుదేరాడు వి.ఎన్. సరిగ్గా అర్థరాత్రి అవుతుం డగా నాయకుల్ని కలిసాడు. కానీ అందులో ఓ లేఖ మరో చోటు కు కూడా చేరాలన్నారు వారు.. అది కొండ ప్రాంతం.. నడి రాత్రి.. అడవిదారి.. ఎలా…? ఆలోచిస్తున్నారా కామ్రేడ్స్… ‘దీనికి ఇంత ఆలోచనెందుకు? నేను వెళ్లగలను’ అని బయలుదేరాడు వి.ఎన్. కర్తవ్యం ముందు ఆ పదిహేనేండ్ల పిల్లవాడిని ఆ అడవి, చీకటి ఏవీ బయపెట్టలేకపోయాయి..! కాలినడకన ఆ కాళరాత్రిని ఛేదించుకుంటూ చేరాల్సిన చోటుకు చేరి, ఆ లేఖను చేర్చాల్సిన వారికి చేర్చి తిరుగు ప్రయాణమయ్యాడు. తెల్లవారక ముందే హాస్టల్ చేరుకోవాలి.. వడివడిగా అడుగులేస్తూ సూర్యాపేటకు చేరుకున్నాడు. కానీ ఇంకో పది నిమిషాల్లో హాస్టల్‌కు చేరుకుంటాడనగా ఎదురయ్యారు పోలీసులు.. చిక్కితే ప్రమాదం.. అయినా భయపడలేదు. ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా వారి కన్నుగప్పి ఓ విద్యార్థులుండే ఇంట్లో చొరబడ్డాడు. ఏ అలికిడీ చేయకుండా వారి మధ్యలో పడుకుని తెల్లవారు జామున లేచి హాస్టల్‌కు చేరుకున్నాడు. ఇది ఆయన తొలి రహస్య జీవితానుభవం. అయితే నిర్బంధంతోపాటే నిజాం వ్యతిరేక ఉద్యమమూ ఉధృతమవుతున్న ఆ సందర్భం అతడిని గెరిల్లా పోరాటానికి ఆహ్వానించింది. మరో ఆలోచనే లేకుండా పదహారేండ్ల ప్రాయంలో చదువులనొదిలి అడవులకేగాడు.
తిరిగి చదువులోకి మళ్లించాలని తండ్రి ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఎందుకంటే, ఆయనేమో పెద్దదొరల గుమస్తా.. ఈయనేమో ఉద్యమాల చౌరస్తా..! ఎలా కుదురుతుంది..? కుదరకపోగా తండ్రి ఏ దొరల దగ్గర మునసబుగా చేస్తున్నాడో ఆ దొరల భూ దురాక్రమణలపైకే పరాక్రమించాడు. ఇది సహించని భూస్వామి తన తండ్రిని మునసబు ఉద్యోగంలోంచి తొలగించడమేగాక, ఇంటినీ ధ్వంసం చేసి ఊరి నుంచే వెళ్లగొట్టాడు. దీనితో ఆ కుటుంబం చెల్లాచెదురైనా చలించలేదు వి.ఎన్. ఇటువంటి ఆటుపోట్లకు లొంగిపోవడానికి ఆయన కేవలం ఉత్సాహంతోనో లేదా యాదృచ్ఛికమైన భావోద్వేగాల ప్రభావంతోనో ఉద్యమంలోకి వచ్చినవాడు కాదు. మార్క్సిజమనే ఓ ప్రాపంచిక దృక్పథం వెలుగులో, దాని ఆచరణపట్ల అచంచలమైన విశ్వాసంతో వచ్చినవాడు. పోరాడటం అనివార్యమైన ప్రజలకు కాలం బహుకరించిన ఓ మేధో ఆయుధం వి.ఎన్. అయితే ఎంతటి మేధావో అంతటి కార్యకర్తగా కూడా అతను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాడు. తన ఆలోచనలకు జీవితాచరణకు మధ్య అడ్డుగీతల్ని చెరిపేసి.. జీవితమే ఉద్యమంగా, ఉద్యమమే జీవితంగా బతికి చూపించిన ‘కామ్రేడ్’ అతడు.
గెరిల్లా దళనాయకుడిగా మొదట సూర్యాపేట ప్రాంతంలోనే బాధ్యతలు చేపట్టినా ఆ తరువాత మానుకోట అడవులకు చేరాడు. అక్కడ నీలాయిగుట్ట కేంద్రంగా గెరిల్లా దళాల నిర్మాణం, వాటి సాయుధ, రాజకీయ శిక్షణ బాధ్యతల్లో తలమునకలై ఉండగానే పోరాటాన్ని ఆదిలాబాద్ అడవులకు విస్తరింపజేసే బాధ్యతనప్పగించింది పార్టీ. అప్పుడు ఆ ఏరియా దళకమాం డర్‌గా.. మానుకోట నుండి మంథని దాకా, అసీఫాబాద్ నుంచి అదిలాబాద్ దాకా.. గోదావరికిరువైపులా గెరిల్లాపోరై ఉదయిం చిన ప్రభాకరుడతడు (అప్పుడు వి.ఎన్ ప్రభాకర్ పేరుతో వ్యవహరించారు). ఆ సమయంలో ఆ ఏరియా కమిటీ సభ్యురా లైన స్వరాజ్యమే కొన్ని సంవత్సరాల తరువాత ఆయన జీవిత సహచరిణి కావడం విశేషం! స్వరాజ్యం తోడుగా కొరియా విప్లవంలో ఎర్రసైన్యాలు అనుసరిస్తున్న వ్యూహాలను తన గెరిల్లా ఎత్తుగడలకు అన్వయించుకుని శత్రు స్థావరాలపై మెరుపు దాడులు సాగించాడు.
అది గోదావరి ఆవలి తీరం.. తూరుపు చీకటిలో ఉండగానే బయలుదేరింది ఓ బస్సు.. అప్పట్లో ప్రతి బస్సుకూ రక్షణగా ఇద్దరు సాయుధులైన పోలీసులుండేవారు. ఆ బస్సును అడ్డగించి వారి ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలన్నది వి.ఎన్. ప్లాన్… రోడ్డుకు అడ్డంగా రాళ్లూ మొద్దులు వేయించి ఇరువైపులా తన దళ సభ్యులతో చెట్ల చాటున మొహరించాడు.. బస్సు ఆగింది.. పోలీసులు దిగారు.. వి.ఎన్. కనుసైగలతో కదిలింది దళం.. రెప్పపాటు వ్యవధిలో వారి నుండి ఆయుధాలు తీసుకుని అడవిలో అదృశ్యమైంది!! ఇలా అనేక దాడులు.. గోదావరి పొడవునా సింగరేణి బొగ్గు సిరులే.. ఆ గనుల వాహనాల రాకపోకలపై మాటువేసి, దాడిచేసి పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకోవడం కూడా వి.ఎన్. వ్యూహాల్లో భాగమే..! ఇలా తన ఎత్తుగడలతో గెరిల్లాపోరుకు కొత్త ఒరవడులద్దిన యుద్ధనిపుణుడతను. ఒక దశలో ఈ వ్యూహాలే సాయుధ దళాలకు ఆయుధాల కొరత తీర్చాయి! కానీ ఇది సహించలేని పోలీసు బలగాలు ప్రభాకర్ (వి.ఎన్.) కోసం అడవిని జల్లెడ పట్టాయి. చివరికి ఓ రహస్య సమావేశంలో మాట్లాడుతుండగా నిరాయుధుడైన వి.ఎన్.ను అరెస్టు చేశారు. కోర్టులో తను ప్రభాకర్ కాదనీ, తన పేరు మల్లు వెంకటనర్సింహ్మారెడ్డి అని వాదించిన ఆయన సమయస్ఫూర్తి ఆ కేసు నుండి బయటపడేసినా… ఇలాంటివే కొన్ని పాత కేసుల మూలంగా పోరాట విరమణ తరువాత కూడా వి.ఎన్. అజ్ఞాతంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఆ విరమణానంతర రహస్య జీవితంలోనే స్వరాజ్యంతో ఆయన వివాహం జరిగింది. కానీ కాపురం ఎక్కడ పెట్టాలో అర్థంకాని పరిస్థితి. పోరాటకాలంలో చెల్లాచెదురైన కుటుంబం తలో దిక్కున తలదాచుకుంది. ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులూ దూరమై నిలువ నీడలేని పరిస్థితులకు కూడా చలించలేదా ధీశాలి. సూర్యాపేట ఉద్యమ అవసరాల రిత్యా సమీపంలోని రాయినిగూడెంలో కాపురం పెట్టిన వి.ఎన్. సూర్యాపేట కార్యదర్శిగా పార్టీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత మార్క్సిస్టుపార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా పార్టీ నిర్మాణానికి అంకితమయ్యారు. ముఖ్యంగా నల్లగొండ ఉద్యమం అగ్రగామిగా రూపుదిద్దడంలో ఆయన నాయకుడా కార్యకర్తా అన్న తేడాలేకుం డా పని చేసాడు. కార్యకర్తల సమర్థతను, పరిమితులను దృష్టిలో ఉంచుకుని బాధ్యతలప్పగించడంలో, వారిని నాయకులుగా తీర్చిదిద్దడంలో ఆయనది ఎంతటి ఓర్పో.. ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో, పార్టీని నడిపించడంలో అంతటి నేర్పు.
ఓ సాధారణ కార్యకర్తగా ప్రారంభమై కమ్యూనిస్టు నేతగా శిఖరాగ్రానికి చేరిన ఆరు దశాబ్ధాల ఆయన ప్రయాణం అనేక అనుభవాల సారం. ఎన్ని చీలికలు..! ఎన్ని విద్రోహాలు..! ఎన్నెన్ని విచ్ఛిన్నాలు..! ఈ సంక్షోభాలన్నిటా పార్టీని కాపాడుకోవడానికి మొక్కవోని ధైర్యం, ఉక్కు సంకల్పంతో ఆయన చూపిన నిర్మాణదక్షత అమోఘమనిపిస్తుంది. అది ఎంతటి ఆపత్కాలమైనా అధైర్యపడకుండా నడుస్తూ నడిపించిన ఆయన సారధ్యం అద్భుతమనిపిస్తుంది. నిర్బంధాలూ, విచ్ఛిన్నాలు ఉద్యమాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు.. సహచరులే ప్రత్యర్థులుగా మారి ఎదురుదాడి చేస్తున్నప్పుడు.. అంతులేని సంఘర్షణకు గురవుతూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోని గుండెనిబ్బరమతడు. మిన్ను విరిగి మీద పడ్డా చలించక.. జయాపజయాలను సమానంగా భావిస్తూ సాగిన జైత్రయాత్ర అతడు. ఆయన ఉద్యమ జీవితంలోని వివిధ దశల్లో ధర్మబిక్షం, భీమిరెడ్డి నరసింహ్మారెడ్డి, ఓంకార్‌లను తన గురువులుగా చెప్పుకుంటారు వి.ఎన్. కానీ చీలికలు, విచ్ఛిన్నాలనుండి పార్టీని కాపాడుకునే క్రమంలో ఈ ముగ్గురినీ ఎదురించడానికాయన వెనుకాడలేదు. ఆయన సైద్ధాంతిక నిబద్ధత ముందు, కర్తవ్యదీక్ష ముందు వ్యక్తిగత అనుబంధాలు, బంధుత్వాలు చాలా స్వల్పమైనవని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.
అతివాద, మితవాద పెడధోరణులనుంచి పార్టీని రక్షించుకుంటూ నిర్మాణరంగ బాధ్యతల్లోనే తలమునకలుగా జీవించిన వి.ఎన్.. 1972లో మాత్రం తుంగతుర్తి నుంచి శాసనసభకు పోటీ చేసి మూడువేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. చరిత్రను పరికిస్తే ఎంతటి మహామహులకైనా కొన్ని బలహీనతలు కనిపిస్తాయి. ప్రత్యేకించి ఆలోచనలకూ ఆచరణకూ మధ్య తేడాలుంటాయి. వాటిని అధిగమించిన ఆదర్శజీవి వి.ఎన్. ఆదర్శాలు చెప్పడం వేరు, ఆదర్శంగా ఉండటం వేరు. వి.ఎన్. రెండవ కోవలోనివారు. ఆయన ఆలోచనలను, ఆచరణను విడదీసి చూడలేం..! పొగడ్తలకు మురవడం, తెగడ్తలకు వెరవడం రెండూ తెలియనివాడు. నిర్భీతి, నిరాడంబరత, నిబద్ధత, నిలకడతనాల కలబోతైన ఆయన జీవితాచరణ చూస్తే అది ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథంలా కనిపిస్తుంది! ఎందుకంటే.. అతడు నిత్యం మదినిండా మానవీయ పరిమళాల్నీ, యెద నిండా కమ్యూనిస్టు విలువల్నీ పోగేసుకుంటూ సాగిన బాటసారి. భావితరాలకు రహదారి.
– రాంపల్లి రమేష్
సెల్ : 8639518341