సైరన్‌ మోగింది

The siren sounded– నవంబర్‌ 30 తెలంగాణ  పోలింగ్‌
–  డిసెంబరు 3 కౌంటింగ్‌

–  తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన సీఈసీ
– తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాంలో ఒకే దశలో పోలింగ్‌
– ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశలు
– వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

న్యూఢిల్లీ : ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల సైరన్‌ మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం నాడిక్కడ ఆకాశవాణి భవన్‌ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీఈసీ చీఫ్‌ రాజీవ్‌ కుమార్‌ తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరాం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో జరుగుతాయని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందనీ, అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. ‘ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో 1.77 లక్షల పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 8.2 కోట్ల పురుషులు, 7.8 కోట్ల మహిళలున్నారు. 20,59,539 ఓట్లు తొలగించాం. 57,89,227 కొత్త ఓటర్లను జత చేశాం. ఇందులో 18-19 ఏండ్ల వయస్సు గల ఓటర్లు 18.37 లక్షల మంది. మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించాం. ఐదు రాష్ట్రాల్లో సోమవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది’ అని రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

రాజస్థాన్‌లో నవంబర్‌ 23న ఎన్నికలు
200 సీట్లున్న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబరు 23న జరగనున్నాయి. రాజస్థాన్‌లో 5,25,38,655 మంది ఓటర్లు ఉన్నారు. 2.73 కోట్ల పురుషులు, 2.52 కోట్ల మహిళలు ఉన్నారు. 4,15,418 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయస్సు గల వారు. 10,57,251 మంది కొత్త ఓటర్లు. 3,95,934 ఓట్లు తొలగించారు. మొత్తం 51,756 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, అందులో 10,415 పట్టణ ప్రాంతాల్లోనూ, 41,341 పోలింగ్‌ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 200 అసెంబ్లీ స్థానాల్లో 144 జనరల్‌ కేటగిరీ కాగా, 25 ఎస్సీ, 43 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అసెంబ్లీ గడువు జనవరి 14తో ముగియనుంది.
నవంబర్‌ 17న మధ్యప్రదేశ్‌ ఎన్నికలు
230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబరు 17న జరగనున్నాయి. 5,60,60,925 మంది ఓటర్లు ఉన్నారు. 2.88 కోట్ల పురుషులు, 2.72 కోట్ల మహిళలు ఉన్నారు. 7,78,789 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయస్సు గల వారు. 19,89,508 మంది కొత్త ఓటర్లు. 7,45,211 ఓట్లు తొలగించారు. మొత్తం 64,523 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, అందులో 16,763 పట్టణ ప్రాంతాల్లోనూ, 47,760 పోలింగ్‌ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 230 అసెంబ్లీ స్థానాల్లో 148 జనరల్‌ కేటగిరీ కాగా, 35 ఎస్సీ, 47 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ గడువు జనవరి 6తో ముగియనుంది.
మిజోరంలో…
40 సీట్లున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబర్‌ 7న జరగనున్నాయి. 8,51,895 మంది ఓటర్లు ఉన్నారు. 4.13 లక్షల పురుషులు, 4.39 లక్షల మహిళలు ఉన్నారు. 9,677 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయస్సు గల వారు. 30,682 మంది కొత్త ఓటర్లు. 16,826 ఓట్లు తొలగించారు. మొత్తం 1,276 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, అందులో 525 పట్టణ ప్రాంతాల్లోనూ, 751 పోలింగ్‌ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
40 అసెంబ్లీ స్థానాల్లో 1 జనరల్‌ కేటగిరీ కాగా, 39 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17న ముగియనుంది.
రెండు దశల్లో చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు
90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబరు 7న తొలి దశ మిజోరంతోనూ, నవంబరు 17న రెండో దశ ఓటింగ్‌ మధ్యప్రదేశ్‌తో కలిసి జరగనుంది. 2,03,60,240 మంది ఓటర్లు ఉన్నారు. 1.01 కోట్ల పురుషులు, 1.02 కోట్ల మహిళలు ఉన్నారు. 2,98,073 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయస్సు గల వారు. 10,10,699 మంది కొత్త ఓటర్లు. 2,90,874 ఓట్లు తొలగించారు. మొత్తం 24,109 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా అందులో 4,815 పట్టణ ప్రాంతాల్లోనూ, 19,258 పోలింగ్‌ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో 51 జనరల్‌ కేటగిరీ కాగా, 10 ఎస్సీ, 29 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ గడువు జనవరి 3తో ముగియనుంది.
తెలంగాణ షెడ్యూల్‌
నోటిఫికేషన్‌ నవంబర్‌ 3
నామినేషన్ల దాఖలకు గడువు నవంబర్‌ 10
నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 13
ఉపసంహరణకు గడువు నవంబర్‌ 15
పోలింగ్‌ నవంబర్‌ 30
ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3

 

Spread the love