ఎండలు జోరు..కూలీలు బేజారు

– ఉపాది ప్రదేశాల్లో కనిపించని వసతులు
– నిర్లక్ష్యంగా పిల్డ్ అసిస్టెంట్స్
– ఇబ్బందుల్లో కూలీలు
నవతెలంగాణ – మల్హర్ రావు
భానుడు భగభగకు తోడుగా డిఆర్డీఏ,ఉపాదిహామీ పిల్డ్ అసిస్టెంట్స్ నిర్లక్ష్యంగా ఉపాది కూలీల పాలిట శాపంగా మారుతోంది.పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ వసతితోపాటు, పస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా అవేమి కానరావడం లేదు.గత్యంతరం లేక తామే ఇండ్ల నుంచి బాటిళ్లను తెచ్చుకుంటున్నామని, అయితే అవి పని పూర్తియ్యేవరకు సరిపోవడం లేదంటున్నారు. అలాగే నీడ వసతి కూడా ఎక్కడా ఏర్పాటు చేయడం లేదని, ఇక పని సమయంలో గాయపడ్డ,వడదెబ్బకు గురైన ప్రథమ చికిత్స అందించేందుకు పస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో లేవని చెబుతున్నారు.
కానరాని వసతులు..
ఉపాధిహామీలో పనిచేసే కూలీలు ఎండలకు అలసిపోతే కాసేపు సేద తీరేందుకు భోజన సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం గతంలో టెంట్ లను సరఫరా చేసింది. వాటిని పిల్డ్ అసిస్టెంట్లు పనిచేసే ప్రాంతాలకు తీసుకెళ్లి కూలీలకు నీడ కల్పించేవారు అయితే గత ప్రభుత్వం 2020 మార్చి 20న పిల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి 2021 ఆగస్టులో తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకుంది.అయితే గతంలో వారికి ఇచ్చిన టెంట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. సంబంధించిన అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడంతో అవి ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే పనిచేసే చోట కూలీలు గాయపడితే వారికి ప్రథమ చికిత్స సంధించేలా మెడికల్ కిట్లు సైతం అందించారు.2016 వరకు వీటిని అందించిన ప్రభుత్వం ఆ తరువాత వాటిని విస్మరించింది.ఎండల్లో పనిచేసే కూలీలకు తాగునీరు అందుబాటులో ఉంచడం ఎంతో కీలకం కనీసం ఆ సదుపాయం సైతం అధికారులు కల్పించకపోవడం గమనార్హం.
పత్తాలేని పరికరాలు..
ఉపాది పనులకు హాజరైయ్యే కూలీలకు అవసరమైన పరికరాలను గతంలో ప్రభుత్వమే సరఫరా చేసేది.గడ్డపారలు, పారలు,ఇనుప తట్టలు,చెట్లను నరికివేసేందుకు గొడ్డళ్లు,కొడవళ్లు అందించేది.క్రమంగా వాటి సరఫరా సైతం నిలిపివేసింది.దీంతో కూలీలు వాటిని సొంతగా కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన దుస్థితి. తాగునీటి కోసం కూలీలకు గతంలో రూ.5 చెల్లించేవారు. అలాగే ఏప్రిల్,మే నెలల్లో ఎండల్లో పనిచేసే కూలీలకు 20 శాతం అదనపు వేసవి భత్యం చెల్లించేవారు.ఇటీవల ఉపాధిహామీ పథకంలో సవరణలు చేసిన కేంద్రం కూలీలకు అందాల్సిన ఈ రెండు ప్రయోజనాలను నిలిపివేసింది. పరికరాల మాట అటుంచుతే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో పనులకు హాజరైయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి పని ప్రదేశాల్లో వసతులు కల్పించేలా చూడాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
మండలంలో గ్రామపంచాయితీలు…15
జాబ్ కార్డులు…8.736
నమోదు చేసుకున్న కూలీలు…20,701
పనులకు హాజరవుతున్న కూలీలు…2,982
కనీస సౌకర్యాలు లేవు..పోచంపల్లి ఐలక్క ఉపాది కూలి
పని ప్రదేశంలో నీళ్లు,నీడ, మెడికల్ కిట్లు తదితర సౌకర్యాలు అధికారులు కల్పించడం లేదు.అసలే ఎండలు మండుతున్నాయి. పరికరాలు అందడం లేదు..మల్లయ్య..ఉపాధి కూలి ఉపాధిహామీ పథకంలో భాగంగా గత మూడు సంవత్సరాలుగా ఉపాది పనులు నిర్వహించడానికి గడ్డపరాలు,పార,తట్టలు,కొడవాళ్ళు,గొడ్డళ్లు తదితర పరికరాలు సరఫరా చేయడం లేదు.ఇప్పటికైనా  ప్రభుత్వం అందించాలి.
ఉపాది పథకంపై నిర్లక్ష్యం…అక్కల బాపు యాదవ్: ప్రజాసంఘాల నాయకుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పతాకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.కూలీలకు వేసవి భత్యం, పరికరాలు అందించడం పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంయ్యాయి.నిబంధనల పేరిట కూలీలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.అలాగే రెండు మూడు వారాలుగా కూలీల వేతనాలు అందడం లేదు.రోజుకు కనీసం కూలి రూ.400 ఇవ్వాలి.
Spread the love