నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో 503 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులకు అదనంగా ఈ 60 పోస్టులను కలుపుతూ వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ గతేడాది జూన్ 11వ తేదీన టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా కొత్తగా 60 పోస్టులను మంజూరు చేయడంతో గ్రూప్-1 ప్రిలిమినరీ మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది.