మధ్య ప్రాచ్యానికి యుద్ధ ముప్పు!

మధ్య ప్రాచ్యానికి యుద్ధ ముప్పు!సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా మధ్యప్రాచ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. గిల్లికజ్జాలు పెట్టుకొని ఇరాన్‌ను రెచ్చగొట్టి యుద్ధంలోకి లాగాలని చూస్తున్నారు. దానిలో భాగమే సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఏప్రిల్‌ ఒకటిన జరిపిన ఆకస్మికదాడి. ఇజ్రాయిల్‌ అక్కడ ఉన్న ఏడుగురు ఇరాన్‌ మిలిటరీ అధికారులను హత్యచేసింది.దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్‌ ఏప్రిల్‌ 13 శనివారం రాత్రి మూడు వందల క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసింది. దీనికి తగు సమయంలో స్పందిస్తామని, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సోమవారం నాడు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. అలాంటి దాడులే జరిపితే క్షణాల్లో ప్రతిదాడులకు తెగబడతామని, గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆయుధాలను రంగంలోకి తెస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఒకవేళ యూదు దురహంకారులకు మద్దతుగా అమెరికా ప్రత్యక్ష పోరులో పాల్గొంటే తాము కూడా దిగుతామని రష్యా హెచ్చరించింది. ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై దాడి గురించి అసలు తమకు తెలియదని, దానితో సంబంధం లేదని ప్రకటించిన అమెరికా ఇజ్రాయిల్‌ దాడి గురించి భిన్నవైఖరి తీసుకుంది. ఇరాన్‌ ముందుగా ఎలాంటి హెచ్చరిక చేయలేదని, తాము ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలుస్తామని జో బైడెన్‌ వెంటనే ప్రకటించాడు. అయితే తాము నేరుగా దాడుల్లో పాల్గొన బోమని చెప్పినట్లు వార్తలు.అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అన్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాటలను నమ్మలేము. ఇజ్రాయిల్‌-ఇరాన్‌ దాడులను చూసినపుడు రాజకీయ కోణంతో పాటు ఆయుధపాటవాన్ని పరీక్షించుకోవటం కూడా కనిపిస్తున్నది.
దాడులు, ప్రతిదాడుల వెనుక ఉన్న కారణాలు తెలిసినప్పటికీ ఇతర అంశాల మీద కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాలు ఆత్మరక్షణ, ఎదురుదాడుల బలాబలాలను సరిచూసుకుం టున్నట్లు చెప్పటం వాటిలో ఒకటి. ఇటు ఇరాన్‌ అటు అమెరికా కూడా పూర్తిస్థాయి పోరుకు సిద్ధంగా లేవని, అయితే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి మరింత సాయం పొందేందుకు ఇజ్రాయిల్‌ వివాదాన్ని రెచ్చగొడుతున్నదని, నివారించలేని స్థితిలో అమెరికా ఉందని చెబుతున్నారు. తన సత్తాను చూపేందుకు ఇరాన్‌ గరిష్టంగా ఆయుధ ప్రయోగం చేయగా, వాటిని తట్టుకొనేందుకు పశ్చిమదేశాలు తనకు కల్పించిన రక్షణ వ్యవస్థ ఎలా ఉందో ఇజ్రాయిల్‌ పరీక్షించుకుంది. రెండు దేశాలకూ ఉన్న పరిమితులను వెల్లడించాయి. మా దెబ్బేమిటో చూడండని కేవలం రుచిచూపేందుకు మాత్రమే ఇరాన్‌ దాడి పరిమితం కాలేదు. పశ్చిమ దేశాలు తమను కాపాడతాయని భావించినప్పటికీ కొన్ని క్షిపణులు ఇజ్రాయిల్‌ ప్రాంతాలను తాకాయి. కనీసం తొమ్మిది క్షిపణులు రక్షణ వలయం నుంచి తప్పించుకున్నాయని, ఐదు నెవాటిమ్‌ అనే వైమానిక స్థావరం మీద పడి సి-130 రకం రవాణా విమానాన్ని, రన్‌వేను, ఖాళీగా ఉన్న గోదామును ధ్వంసం చేసినట్లు, మరో నాలుగు వేరే వైమానిక స్థావరం మీద పడినట్లు వార్తలు వచ్చాయి. సహజంగానే నష్టాన్ని తక్కువగా చూపేందుకు, అసలేమీ జరగలేదని చెప్పేందుకూ చూస్తారన్నది తెలిసిందే. క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఏరో-3 అనే ఆధునిక వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేశారని, దాన్ని తప్పించుకొని తొమ్మిది క్షిపణులు రావటం ఇజ్రాయిలీలను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. దాడి గురించి తాము నాలుగు రోజుల ముందే అమెరికాతో సహా ఇరుగు పొరుగుదేశాలన్నింటినీ హెచ్చరించామని ఇరాన్‌ ప్రకటించింది. బహుశా ఈ కారణంగా విమానాలు, ఇతర ఆయుధాలను వైమానిక స్థావరాల నుంచి వేరే చోటికి ఇజ్రాయెల్‌ తరలించి ఉండవచ్చు.
ఇజ్రాయిల్‌ రక్షణ దళాల ప్రతినిధి వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇరాన్‌ ప్రయోగించిన వాటిలో 170డ్రోన్లు,120 క్షిపణులు ఉన్నాయి, ఇరాన్‌, ఇరాక్‌, ఎమెన్‌,లెబనాన్ల నుంచి 350 రాకెట్లను వదిలారు. నాలుగు గంటల పాటు దాడి జరిగింది. రెండు దేశాల మధ్య 1,600 కిలోమీటర్ల దూరం ఉంది. తూర్పు మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు నాలుగు నుంచి ఆరు క్షిపణులు, 70డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా అధికారులు చెప్పారు.దాడి జరిగిన తరువాత జో బైడెన్‌ ఇజ్రాయిల్‌ నేత నెతన్యాహుతో మాట్లాడుతూ మద్దతుగా ఉంటాం తప్ప ఇరాన్‌ మీద జరిపే ఏ దాడిలోనూ తాము ప్రత్యక్షంగా పాల్గొనేది లేదని చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి.ఆదివారం నాడు జి7 దేశాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సులో సమావేశమై ఇరాన్‌ దాడిని ఖండించారు. ఈ చర్య అదుపు చేయలేని పరిస్థితికి దారితీస్తుం దని హెచ్చరించారు. ఆదివారం నాడు సమావేశమైన ఇజ్రాయిల్‌ యుద్ధ మంత్రివర్గం ఎలా స్పందించాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.సోమవారం నాడు కూడా తీవ్ర తర్జనభర్జనలు జరిపింది.పరిస్థితి మరింత విషమించ కుండా చూడాలని బైడెన్‌ ప్రకటించటం, ప్రతి దాడికి అవసరమైన ఎత్తుగడలను రచించేందుకు సమయం తీసుకొనేందుకు, అమెరికా మీద మరింత ఒత్తిడి పెంచేందుకు వ్యవధి తీసుకుంటున్నట్లు, ఇజ్రాయిల్‌కు తాము కల్పించిన రక్షణ కవచం పనితీరును పశ్చిమదేశాలు సమీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. నెపం ఎవరి మీద, ఎలా నెట్టాలన్నది కూడా ఆలోచించటం సహజమే.
ప్రధాని నెతన్యాహు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని ఇజ్రాయిల్‌ మిలిటరీ అధిపతి హెర్జీ హల్‌వెల్‌ చెప్పగా, ఏవైనా ప్రతిదాడులు జరిగితే క్షణాల్లో స్పందిస్తామని ఇరాన్‌ ఉపవిదేశాంగ మంత్రి అలీ బగేరీకాన్‌ చెప్పాడు. తన సార్వభౌమత్వాన్ని రక్షించుకుంటూ పరిస్థితి చేయిదాటకుండా ఇరాన్‌ వ్యవహరించగలదని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.పరిస్థితి మరింతగా దిగజారటం ఎవరికీ మంచిది కాదని రష్యా పేర్కొన్నది. ఇరాన్‌తో యుద్ధాన్ని తాము కోరుకోవటం లేదని, ఎప్పుడు, ఎలా స్పందించాలన్నది నిర్ణయించుకోవాల్సింది ఇజ్రాయిలేనని అమెరికా చెప్పింది. సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై చేసిన దాడిని తాము సమర్దిస్తున్నట్లు బ్రిటన్‌ పేర్కొన్నది. ఇజ్రాయిల్‌పై దాడి తరువాత మరిన్ని ఆంక్షల గురించి ఆలోచిస్తున్నట్లు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి చెప్పాడు. గత రెండు రోజులుగా ఇజ్రాయిల్‌ మీదుగా ప్రయాణించే విమానాలను అనేక సంస్థలు వేరే మార్గంలో నడుపుతున్నాయి.భద్రతా కారణాల రీత్యా ఇరాన్‌ తన అణుకేంద్రాలను ఆదివారం నాడు మూసివేసింది. వాటిపై ఇజ్రాయిల్‌ దాడి జరపవచ్చని అంతర్జాతీయ అణుఇంధన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెస్‌ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబం ధాలను నెలకొల్పుంటున్న సంగతి తెలిసిందే. దాని చెడగొట్టేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారు.ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను మధ్యలో కొన్నింటిని సౌదీ అరేబియా అడ్డుకున్నదంటూ ఇజ్రాయిల్‌ మీడియా సంస్థలు కొన్ని వార్తలను అల్లాయి.ఈ వార్తలను సౌదీ వర్గాలు ఖండించాయి.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలను వ్లదిమిర్‌ పుతిన్‌ తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని కొందరు విశ్లేషకులు పశ్చిమదేశాలకు హితవు చెప్పారు.బహుశా ఈ అంశం అమెరికా దృష్టిలో ఉన్న కారణంగానే తొందరపడవద్దని ఇజ్రాయిల్‌కు సలహా ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పశ్చిమ దేశాల దృష్టి మధ్య ప్రాచ్యంవైపు మళ్లితే ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్‌ను చావు దెబ్బతీయటం మరింత సులభం అవుతుంది.ఇప్పటికే ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థ నాశనానికి రష్యా దాడులు జరుపుతున్నది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ వనరులన్నింటినీ ఇరాన్‌ మీద కేంద్రీకరిస్తే అమెరికా నాటోలోని తన అనుయాయి దేశాలకు భద్రత కల్పించలేదన్న భావన మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందించాల్సిన అమెరికా సాయం ఆలస్యం అయిందన్న అభిప్రాయం ఉంది.దాదాపు ఆరునెలల క్రితం ప్రకటించిన 60బిలియన్‌ డాలర్ల సహాయం గురించి ఇంతవరకు పార్లమెంటు ఖరారు చేయలేదు. మరోవైపు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌ బంధం మరింత పటిష్టం అవుతుంది. మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో రష్యా ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే రష్యా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇరాన్‌ తయారు చేసిన డ్రోన్లను ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఎత్తుగడలు, లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమస్యలు కూడా ఉన్నాయి.బింకంగా మాటలు చెప్పవచ్చు, ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ ఇజ్రాయిల్‌ వెంటనే స్పందించకపోవటానికి దాని మీద ఉన్న ఒత్తిడి ఒక కారణం. ఎన్నికల్లో ఉన్న బైడెన్‌కు ఇప్పుడు పూర్తిస్థాయి పోరు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆరునెలలు దాటినా సాధారణ పౌరులపై మారణకాండ, గాజాలో విధ్వంసకాండ సాగించటం తప్ప బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకోలేకపోయింది. రోజురోజుకూ ఈ అంశం ఒత్తిడి పెంచుతున్నది. హమాస్‌ సాయుధులను అణచివేస్తామన్న మాటలు ప్రగల్భాలుగానే ఉన్నాయి. యుద్ధమంటూ మొదలైతే ఇజ్రాయిల్‌ మీద రెండు మూడు వైపుల నుంచి దాడులు జరుగుతాయి. ఇరాన్‌పై ప్రతిదాడుల అంశంలో ఇజ్రాయిలీ యుద్ధ మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.
ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి గౌరవప్రదంగా ఎలా బయట పడాలో తెలియని పశ్చిమ దేశాలు 193 రోజుల గాజా మారణకాండ తరువాత తదుపరి ఏమిటన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇరాన్‌ దాడులు జరిపిన వెంటనే ఇజ్రాయిల్‌ వైమానిక దళం దక్షిణ లెబనాన్‌లోని హిజబుల్లా స్థావరాలపై ప్రతిదాడులు జరిపింది. ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్న జోర్డాన్‌ పాలకులకు వ్యతిరేకంగా అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నట్లు వార్తలు. మొత్తంగా చూసినపుడు రెండు దేశాలూ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాయి, వాటికి మద్దతుగా ఉన్న దేశాల పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఐరోపా దేశాలు కూడా ప్రతిదాడులు వద్దని ఇజ్రాయిల్‌ను కోరాయి. ఈ వారంలో ఢిల్లీ పర్యటనకు రావాల్సిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ వాయిదా వేసుకున్నారు. తమ రాయబార కార్యాలయం మీద జరిగిన దాడికి ప్రతిగా ఇరాన్‌ స్పందించి ఒక దాడితో ముగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్‌ తెగబడితే అది అంతటితో ఆగదు అని వేరే చెప్పనవసరం లేదు.
ఎం కోటేశ్వరరావు
8331013288

Spread the love