సుప్రీం..!

 Editorial అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం లెక్క చేయరాయన! ఎన్నికల బాండ్లు అవినీతికరమైనవని, వెంటనే రద్దు చేయాలని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అటువంటి తీర్పునే తప్పుపడుతున్నారు మన అధినేత. పైగా ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని పదే పదే సమర్ధించుకుంటూనే ఉన్నారు. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పును దేశాధినేతే టిష్యూ పేపర్‌లా వాడటం ఎంత దుర్మార్గం! సుప్రీం కోర్టుపై ఈయన ‘సుప్రీం’ నేతేమో!
ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అంతే కాదు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్‌ ప్రో కో(నీకింత, నాకింత)కు దారితీస్తుందని కూడా పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్లొక్కటే మార్గం కాదని, దీనికి ప్రత్యామ్యాయ మార్గాలు ఉన్నాయని కూడా గుర్తు చేసింది. అయినా ‘ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శక వచ్చింది, వీటి రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుంది, దాని వల్ల అందరూ బాధపడతారు’ అంటూ పాచి పాటే పాడుతున్నారు. అంటే కార్పొరేట్లకు దోచిపెడుతూ దేశాన్ని దివాళా తీయించాల్సింది ఇంకా ఉందని చెప్పకనే చెబుతు న్నారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, సుప్రీం లీడర్‌ ఎవరూ ఆవిర్భవించలేరు’ అంటూ తన సుపీరియారిటీని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీయిస్తానని చెప్పి, కార్పొరేట్ల బ్లాక్‌ మనీని వైట్‌మనీ చేయించిన పెద్ద మనిషి, ఎన్నికల బాండ్లతో నల్లధనాన్ని ఎలా మాయం చేస్తారో మరి!
ఇక అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో బీజేపీ విరాళాలు పొందడం కోసం ఎలాంటి వినాశకర పద్ధతులను అనుసరించిందో దేశానికి తెలిసిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రకృతి సంపదను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను శాఖలను దుర్వినియోగం చేస్తూ చందా దందాలకు పాల్పడింది. ఈ అక్రమంగా వచ్చిన డబ్బుతో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి, ఎన్నికైన ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వినియోగించిందని ఈ పదేండ్ల బీజేపీ చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మతం, ధర్మం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రూ.వేల కోట్లను విచ్చిలవిడిగా ఖర్చు చేయగలుగుతున్నది. నీతి, జాతి, దేశభక్తి, దైవభక్తి లాంటి మాటల గారడీతో జరిపిన కుతంత్రాలు కోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చాయి.
అయితే అవినీతి అంతానికి తనకు ఈడీ, సీబీఐ ఎంతగానో సహకరించిందని ఇంటర్వ్యూలో పొగడ్తలతో ముంచెత్తారు. కానీ నల్లడబ్బు వెలికితీత, అవినీతి అంతం అనే పదాలకు ఈడీ, ఐటీ దాడులకు, సోదాలకు అర్థాలు వేరులే అని రుజువైంది. దేశ ప్రజలకు వేల ధర్మోపదేశాలు చేసిన స్వయం ప్రకటిత విశ్వగురువు ఏలుబడిలో ప్రజాస్వామ్యానికి ఎంత భయంకరమైన చీడ పట్టిందో తేటతెల్లమైంది. ఎన్నికల బాండ్ల ద్వారా అందిన మొత్తం విరాళాలలో సగానికి పైగా బీజేపీ ఖాతాల్లో చేరిందని అధికారిక లెక్కలు స్పష్టంగా ఉన్నాయి.
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇంకా పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు కూడా ప్రకటించాడు. ‘ఇదంతా దేశాన్ని అగ్రదేశంగా మార్చేందుకే’, ఎవ్వరూ భయపడాల్సింది లేదు’ అని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. అదే రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశాన్ని రామరాజ్యంగా మార్చేస్తామన్నాడు. అంతేనా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను తప్పక అమలు చేస్తామని సూటిగానే చెప్పాడు. ఒక పక్క 400 సీట్లొస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని తన కాషాయ ఎంపీల నోటి వెంట చిలకపలుకు పలికిస్తూ మరోపక్క అదంతా దుష్ప్రాచారమని కొట్టిపడేస్తున్నాడు. బహుశా ఇవేనేమో మన అధినేత తీసుకోబోయే ఆ పెద్ద పెద్ద నిర్ణయాలు.
‘మోడీనే భారత్‌, భారత్‌ అంటే మోడీనే’ అంటూ తన కాషాయ దళంతో ఇంటింటి ప్రచారాలు చేయించేందుకు కోట్లు ఖర్చుపెడుతున్నాడు. యువతతో సెల్ఫీలు దిగి ఓట్లకై గాలం వేస్తున్నాడు. తనని తాను భరతమాత ముద్దుబిడ్డగా కితాబిచ్చుకుం టున్నాడు. అవినీతిని అంతం చేయడమే బీజేపీ లక్ష్యమని పదే పదే చెప్పుకుంటున్న మోడీకి మించిన అవినీతి పరుడు లేడని చెప్పడానికి ఎన్నికల బాండ్ల ఉదాహరణ ఒక్కటి చాలు. పార్లమెంటు ఎన్నికలు ముగియక ముందే ఐఏఎస్‌ అధికారులను పిలిచి రాబోయే తన వంద రోజుల పాలన ఎలా ఉండాలో, దానికి సంబంధించిన లెక్కలు అడిగాడంటే ఇంత కంటే నియంతృత్వం ఇంకేముంటుంది!
కనుక ‘మోడీ ఎంత శక్తివంతమైతే దేశంలో ప్రజాస్వామ్యానికి అంత ప్రమాదం’ అని ఏఎన్‌ఐ అడిగిన ప్రశ్న వందశాతం సరైనదే. ఇలా తన పాలనలో జరిగిన అంతులేని అవినీతికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మూడోసారి అధికారం కోసం తహతహలాడుతున్నాడు. పదేండ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీని ఓడించి మోడీని గద్దె దింపడమే ఆ పార్టీకి ప్రజలు విధించాల్సిన అసలైన శిక్ష.

Spread the love