ఇదేనా సనాతన ధర్మం?

Is this Sanatana Dharma?– కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి గైర్హాజరుపై ఉదయనిధి స్టాలిన్‌
– గిరిజనురాలు, వితంతువు కావటం వల్లనే ఆమెను ఆహ్వానించలేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గైర్హాజరిని ఉటంకిస్తూ సనాతన ధర్మం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ద్రౌపది ముర్ము వితంతువు, గిరిజనురాలు కావటం వల్లనే ఆమె గైర్హాజరు కావాల్సి వచ్చిందని అన్నారు. మధురైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్‌ బీజేపీ లక్ష్యంగా పై వ్యాఖ్యలు చేశారు. ”కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. వారు (బీజేపీ) ప్రారంభోత్సవానికి తమిళనాడు నుంచి అధీనం పొందారు. కానీ ఆమె(రాష్ట్రపతి) వితంతువు, గిరిజన వర్గానికి చెందినందున ఆహ్వానించలేదు. ఇదేనా సనాతన ధర్మం?” అని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా తాము గొంతెత్తుతామని అన్నారు. కొత్త పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన బంగారు పూత పూసిన వెండి భూతమైన సెంగోల్‌ను తీసుకువెళ్లిన 21 మంది హిందూ పూజారుల (తమిళనాడుకు చెందిన అధీనం) సమక్షంలో పార్లమెంట్‌ భవనం ప్రారంభించబడిన విషయం విదితమే. ఆ సమయంలో ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవటం పట్ల విపక్షాలు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కొత్త పార్లమెంట్‌లో మొదటి సెషన్‌ జరిగిన రోజు (బుధవారం) పార్లమెంటును సందర్శించిన కంగనా రనౌత్‌, ఈషా గుప్తాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రపతికి ఆహ్వానం అందలేదు కానీ ,కొంతమంది హిందీ నటులు కొత్త పార్లమెంటుకు ఆహ్వానించబడ్డారని ఉదయనిధి చెప్పారు. ”నిన్న కూడా, వారు(బీజేపీ) బిల్లు ప్రవేశానికి సినీ నటీమణులను ఆహ్వానించారు. కానీ రాష్ట్రపతిని కాదు. అందరూ సమానంగా ఉండాలని మేము సూచిస్తున్నాం. కాబట్టి, సనాతనను నిర్మూలించడమే మా లక్ష్యం” అని ఉదయనిధి నొక్కిచెప్పారు. ఈ విషయంలో డీఎంకే వైఖరికి గల కారణాలనూ ఆయన వెల్లడించారు. నా చావుకు పిలుపునిచ్చి, నా తలపై వెల ప్రకటించే పూజారుల వల్ల తాను భయపడను అని కూడా ఆయన చెప్పాడు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదనీ, దానిని నిర్మూలించాల్సినవసరం ఉన్నదని ఆయన గతంలో చేసిన ప్రకటనల తర్వాత, ఉదయనిధికి బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా అయోధ్య పీఠాధిపతి పరమహంస ఆచార్య ఉదయనిధి తల నరికివేస్తే రూ. 10 కోట్ల రూపాయల రివార్డును సైతం ప్రకటించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రధాని మోడీ సహా, బీజేపీ నేతలు, హిందూత్వ గ్రూపుల నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

Spread the love