బీజేపీలో టికెట్ల చిచ్చు

– సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బంగారు శృతి
– ఈటలకు టికెట్‌తో కాంగ్రెస్‌ వైపు కూన, వీరేందర్‌ చూపు
– పాటిల్‌కు టికెట్‌పై జహీరాబాద్‌ శ్రేణుల కినుక
– రెండో విడతలో నాకే టికెట్‌ అంటున్న సోయం
– మహబూబ్‌నగర్‌లో డీకే వర్సెస్‌ జితేందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ తెలంగాణ శాఖలో టికెట్ల చిచ్చు చెలరేగుతున్నది. ఇన్నాళ్లూ కష్టమొచ్చినా..నష్టమొచ్చినా పార్టీనే అట్టిపెట్టుకుని ఉన్న బంగారు శృతి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని స్వయంగా వెళ్లి కలవటం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ఆమె త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. మహబూబ్‌నగర టికెట్‌ తనకంటే తనకే అంటుండటంతో డీకే అరుణ వర్సెస్‌ జితేందర్‌రెడ్డి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన తాజా ఎంపీ బీబీ పాటిల్‌కు రాత్రికి రాత్రే టికెట్‌ కన్ఫర్మ్‌ చేయడం విమర్శలకు తావిస్తున్నది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న శ్రేణుల ఆగ్రహానికి రాష్ట్ర నాయకత్వం గురవుతున్నది. రాష్ట్రస్థాయిలో ఎన్ని ఆటంకాలు సృష్టించినా జాతీయ నాయకత్వం అండతో టికెట్‌ దక్కించుకున్న ఈటలను మరోమారు ఓడగొట్టేందుకు సొంత పార్టీ శ్రేణులే సన్నద్ధమవుతుండటం ఆ పార్టీని కలవరపెడుతున్నది. తనకు మల్కాజిగిరి స్థానం దక్కకపోవటంపై పార్టీలో హార్డ్‌కోర్‌ నాయకుడిగా పేరున్న మురళీధర్‌రావు అలకపాన్పు ఎక్కటం ఇబ్బందిగా మారింది. ఈటలకు టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ కూన శ్రీశైలంగౌడ్‌, తూళ్ల వీరేందర్‌గౌడ్‌ బీజేపీని వీడుతారనే చర్చ నడుస్తున్నది. మరోవైపు ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ కీలక నేతలు ఈటలకు వ్యతిరేకంగా గ్రూపు కట్టి ఆయన్ను పనిగట్టుకుని ఓడించే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ విద్యాసంస్థల అధినేతకు టికెట్‌ ఇస్తామని కొందరు బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు కొమురయ్యను ఆర్థికంగా వాడుకున్నారనే విమర్శ బలంగా వినిపిస్తున్నది. ఈ విషయంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌ అయ్యి హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె శృతి తనకు నాగర్‌ కర్నూల్‌ స్థానం కేటాయించకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నేండ్లు పార్టీ కోసం కష్టపడిన తనను కాదని భరత్‌కు ఇవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారబోతున్నారనే చర్చా మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె కలవడం దానికి మరింత బలం చేకూరింది.
ఈసారి తమకే గన్‌షాట్‌ టికెట్లు అని పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సోయం బాపూరావు(ఆదిలాబాద్‌), డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), రఘునందన్‌రావు(మెదక్‌) తమకు ఇంకా టికెట్‌ ఖరారు చేయకపోవడంపై పార్టీ నాయకత్వంపై కుతకుత ఉడికిపోతున్నారు. మెదక్‌ నుంచి ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతను రంగంలోకి దింపాలనే యోచనతోనే రఘునందన్‌రావును నాయకత్వం పక్కన బెట్టినట్టు తెలిసింది. ఒకవేళ టికెట్టు దక్కకపోతే వారు పార్టీలో ఉండటమూ కష్టమే. తరుచూ గిరిజనులకు వ్యతిరేకంగా నోరుపారేసుకోవడం, సొంతింటికి ఎంపీ నిధులను ఉపయోగించుకున్నారనే ఆరోపణలు రావటం, పార్టీ శ్రేణులను కలుపుకుని పోకుండా ఒటెత్తు పోకడలకు పోవడం వంటి వాటివల్లనే బాపూరావుకు అభ్యర్థిత్వం ఖరారు కాలేదనే చర్చ బీజేపీలో నడుస్తున్నది. ఆ స్థానం నుంచి మాజీ ఎంపీలు రమేశ్‌రాథోడ్‌, నగేశ్‌లలో ఒకరిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి జాతీయ నాయకత్వం వచ్చింది. దీనిపై బాపూరావు గుర్రుగా ఉన్నారు. ఆదిలాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ‘సెకండ్‌ లిస్టులో నా పేరుంటుందనే విశ్వాసం ఉంది. 2019లో జెండా పట్టుకునేందుకు కూడా సరిగా కార్యకర్తలు లేని సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాను. ధైర్యంగా ఆదిలాబాద్‌ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని బీజేపీని ముందుకు తీసుకెళ్లాను. 42 ఎంపీటీసీలు, 6 జెడ్పీటీసీలు, అనేక మంది సర్పంచులను దగ్గరుండి గెలిపించాను. రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందితే అందులో నలుగురు ఎమ్మెల్యేలు నా నియోజకవర్గం వారే. ఈస్థాయిలో పార్టీని డెవలప్‌మెంట్‌ చేసినంక నాకెందుకు టికెట్‌ ఇవ్వరు?’ అంటూ బాంబు పేల్చారు. నల్లగొండ నుంచి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని, ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీ నామానాగేశ్వర్‌రావును, మహబూబాబాద్‌ నుంచి తాజా బీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కాదంటే హుస్సేన్‌ నాయక్‌, వరంగల్‌ నుంచి ఆరూరు రమేశ్‌ను రంగంలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర కీలక నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. తొలి విడత టికెట్ల పంపకం తర్వాత బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే…బీజేపీ అభ్యర్థులను ఓడించడానికి వేరే వారు అవసరం లేదు..సొంతగూటి నేతలే సరిపోతారనే చర్చ అప్పుడే మొదలైంది. టికెట్ల పంచాయతీ మునుముందు ఎలాంటి పరిణామాలను దారితీస్తుందో చూడాల్సిందే.

Spread the love