సకాలంలో వీసీల నియామకం

– ఈసీ అనుమతితో సెర్చ్‌ కమిటీలు వేస్తాం
– పోలింగ్‌ తర్వాత కసరత్తు వేగవంతం
– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల (వీసీ)లకు గడువు ముగిసేలోపు సకాలంలో కొత్త వీసీలను నియమిస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ తర్వాత కసరత్తును వేగవంతం చేస్తామన్నారు. ఈసీ అనుమతితో సెర్చ్‌ కమిటీలను వేస్తామని అన్నారు. రాష్ట్రంలో పది వర్సిటీల వీసీల పదవీ కాలం వచ్చేనెల 21తో ముగియనున్న విషయం తెలిసిందే. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను సెర్చ్‌ కమిటీ పరిశీలిస్తుంది. అర్హులైన వారి జాబితాను రూపొందిస్తుంది. అనంతరం ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. వాటిని గవర్నర్‌ ఆమోదానికి ప్రభుత్వం పంపిస్తుంది. ఆ తర్వాత వీసీలను ప్రకటిస్తుంది. ఒకవేళ ప్రస్తుత వీసీల పదవీకాలం ముగిసేలోగా ఆ ప్రక్రియ ఆలస్యమైతే ఐఏఎస్‌ అధికారులకు ఇన్‌చార్జీ వీసీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశమున్నది. రాష్ట్రంలో పది వర్సిటీలకు 320 మంది ప్రొఫెసర్లు 1,382 దరఖాస్తులను సమర్పించారు. అత్యధికంగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ)కు 208, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)కు 193, పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)కు 159, శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ)కు 158, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)కు 157, కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)కు 149, తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ)కు 135, జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్‌ కు 106, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ (పీఎస్‌టీయూ) 66 దరఖాస్తులొచ్చాయి. అత్యల్పంగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)కు 51 దరఖాస్తులను సమర్పించారు.

Spread the love