రేపే టీడీపీ మహానాడు

నవతెలంగాణ – అమరావతి: చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతనే శుక్ర, శనివారాల్లో ఈ మహనాడును అద్భుతంగా చేపట్డనున్నారు.అదీగాక టిడిపి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి ముగింపోత్సం ఈ వేడుకల్లో జరగనుంది. అందుకనే ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో టిడిపి బలోపేతం కావడానికి ఈ మహానాడు దోహదపడనుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సంవత్సరంలో జరిగే ఈ మహనాడు లో టిడిపి మొదటి మానిఫేస్టోను ఇక్కడ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో 2006 మే 27,28,29 తేదీల్లో మహానాడు నిర్వహించారు. గత మహానాడు నిర్వహణలో కీలక పాత్ర పోసించిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి ఆ అనుభవంతో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. 38 ఎకరాల విశాలమైన గ్రౌండ్లో ఆదివారం మహానాడు సభ జరగనుంది. ఆరోజు 10 నుంచి 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే శనివారం భూలోకమ్మ గుళ్ళు సమీపంలో టిడిపి ప్రతినిధులు సభ సుమారు 15 వేల మందితో నిర్వహిస్తున్నారు. అక్కడ అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ కు చెందిన కేకే ఈవెంట్ సంస్థ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాన్ని, ఎండలను తట్టుకునే విధంగా రూపొందించారు. అలాగే రక్తదానం శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్,ప్రెస్ గ్యాలరీ, భోజన హాల్స్ లను అద్భుతంగా తీర్చిదిద్దారు. గోదావరి రుచులను, ఆతిథ్యాన్ని ఈ మహానాడులో రుచి చూపించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు తరలిరానున్నారు. అందుకుని రాజమహేంద్రవరం తోపాటు పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, కళ్యాణ్ మండపాలు, గెస్ట్ హౌస్ లో అన్నీ పది రోజులు క్రితమే బుక్ అయిపోయాయి. ఇక పోలీసులు, సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలో ఉండి విధులు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మహనాడు జరిగే ప్రదేశాలతో పాటు జాతీయ రహదారి పొడవనా భారీ ఫ్లెక్సీలను కట్ అవుట్లను ఏర్పాటు చేశారు. అలాగే రాజమహేంద్రవరం నగరమంతా తెలుగు దేశం పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్ర వారం సాయంత్రానికి జిల్లాకు చేరుకోనున్నారు.

Spread the love