నేడు టీపీసీసీ అత్యవసర సమావేశం

– మహేష్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఈనెల 16,17 తేదీల్లో సీడబ్య్లూసీ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం టీపీసీసీ అత్యవసర విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యవర్గ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
గాంధీభవన్‌లో ప్లెక్సీ కలకలం
ఎల్బీనగర్‌ ప్లెక్సీల వార్‌కు గాంధీభవన్‌ వేదికైంది. రెండు వర్గాలతో క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ పేరుతో గాంధీభవన్‌ వద్ద ‘మధుయాష్కీగౌడ్‌ ఎల్బీనగర్‌కు రావొద్దు. తిరిగి నిజామాబాద్‌కు పోవాలి’ అనే పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లు ఏర్పాటుతో రాజకీయ కలకలం రేపుతున్నది. ఈ విషయంపై తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్బీనగర్‌లో తనకు సర్వేలన్ని అనుకూలంగా ఉన్నాయనీ, ఇలాంటి చిల్లర చేష్టలు తనను ఏమీ చేయలేవని తెలిపారు. ఈ స్థానం నుంచి తనకే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. తన గెలుపు కోసం నియోజకవర్గంలో పని చేసుకుంటున్నాననీ, ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెక్కాయి.
పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్‌ కమిటీ విడివిడిగా భేటీ
తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి దరఖాస్తుల పరిశీలన ముగిసిన నేపథ్యంలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించింది. ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్‌ కమిటీ విడివిడిగా భేటీ అయింది. ఈమేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి.హనుమంతరావు, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పార్టీ కోసం కష్టపడిన నాయకులకు సముచిత స్థానం కల్పించాలంటూ లేఖ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు టికెట్లు ఇవ్వాలని కోరుతూ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ మురళీధర్‌కు మానవతారారు, కొనగాలి మహేష్‌, బాలలక్ష్మి, విజరు వినతిపత్రం సమర్పించారు.

Spread the love