జంటనగరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

– నేడు తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
– రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం
– బీజేపీది విమోచన దినోత్సవం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల నేపథ్యంలో జంటనగరాల్లో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్‌ 17న భారతదేశంలో తెలంగాణ విలీనమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుండగా, విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కవాతులో సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన నున్నారు. ఇదిలావుండగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వేడుకల్లో మంత్రులు, ప్రభుత్వ అధికారులు, వీఐపీలు, వీవీఐపీలు పాల్గొననుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బోయిన్‌పల్లి, రసూల్‌పురా, సికింద్రాబాద్‌, నాంపల్లి, వైఎంసీఏ, బషీర్‌బాగ్‌, ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్‌, హిమాయత్‌నగర్‌, అబిడ్స్‌, కోఠీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్‌ చేయాలని అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Spread the love