– సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో ఉన్న స్థానికేతరులుగా ఉన్న ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా ఉద్యోగుల విభజన కూడా జరిగిందని తెలిపారు. రాష్ట్రస్థాయి ఉద్యోగులకు మాత్రమే ఆయా రాష్ట్రాల బదిలీలకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. జిల్లా/జోనల్/ మల్టీజోనల్ ఉద్యోగులు స్థానికేతరులుగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన ఉద్యోగులు దాదాపు 514 మంది ఏపీలో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని వివరించారు. స్థానికేతరులుగా అక్కడ పనిచేయడం వల్ల పిల్లల రిజర్వేషన్ కోల్పోవడం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణాలో పనిచేస్తున్న ఏపీకి చెందిన దాదాపు 1,808 మందిని వారి రాష్ట్రానికి తీసుకవెళ్లడానికి అక్కడి ప్రభుత్వం నిర్ణయం చేసిందని గుర్తు చేశారు. ఆ దస్త్రం తెలంగాణ ప్రభుత్వం వద్ద పెండిరగ్‌లో ఉందని తెలిపారు. ఇప్పటికే తొమ్మిదేండ్లు గడిచాయని పేర్కొన్నారు. ఉద్యోగుల బాధలను గుర్తించి స్థానికేతరులుగా పనిచేస్తున్న ఉద్యోగులను సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు.