ప్రత్యేక కేటగిరీ టీచర్లకు త్వరలో బదిలీలు

ప్రత్యేక కేటగిరీ టీచర్లకు త్వరలో బదిలీలు– వెబ్‌పోర్టల్‌ను రూపొందించిన విద్యాశాఖ
– వారం, పదిరోజుల్లో దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయుల బదిలీలు త్వరలో చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దీనిపై చర్చించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను రూపొందించారు. దరఖాస్తు నమూనాను తయారు చేశారు. సాధారణ బదిలీల ప్రక్రియలో అవకాశం లభించని వారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, క్యాన్సర్‌ బాధితులుగా ఉపాధ్యాయులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. వారం, పది రోజుల్లో ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశమున్నది. ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయులు బదిలీ అవకాశం కల్పించాలంటూ విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి ఉన్నతాధికారులకు విజ్ఞాపన పత్రాలను అందజేస్తున్నారు. ఇంకోవైపు ఒకే బడిలో రెండేండ్ల సర్వీసు పూర్తయిన వారు కూడా బదిలీ అవకాశమివ్వాలంటూ కోరుతున్నారు. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు.
కొత్త టీచర్లు వస్తేనే ఎస్జీటీలకు స్థానచలనం
రాష్ట్రంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)ల పరిస్థితి అయోమయంగా మారింది. 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1,22,386 ఉపాధ్యాయ పోస్టులున్నాయి. అందులో ప్రస్తుతం 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 19,043 ఉపాధ్యాయ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో 50,808 మంది ఎస్జీటీలు పనిచేస్తున్నారు. వారిలో 25,036 మంది సోమవారం బదిలీ అయ్యారు. కానీ వారిలో 50 శాతం మంది ఎస్జీటీలకు మాత్రమే స్థానచలనం కలిగింది. మిగిలిన సగం మంది ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ అదే పాఠశాలలో కొనసాగాల్సి వస్తున్నది. కొత్త టీచర్లు వచ్చే వరకు వారు అక్కడే కొనసాగాల్సి ఉంటుంది. దీంతో బదిలీ అయి స్థానచలనం పొందని ఎస్జీటీలు ఆందోళన చెందుతున్నారు. వారిని వెంటనే రిలీవ్‌ చేయాలంటూ పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో మల్టీజోన్‌-1లో 11,177 మంది, మల్టీజోన్‌-2లో 7,765 మంది కలిపి మొత్తం 18,942 మంది ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. హైకోర్టులో కేసు ఉండడంతో రంగారెడ్డి జిల్లాలో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం 955 మంది స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు జరిగాయి. బుధవారం సుమారు 700 మంది ఎస్జీటీలు, పీఈటీలు, భాషాపండితులకు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులు లభిస్తాయి. అందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సుశీందర్‌రావు జారీ చేస్తారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు వెంటనే కేటాయించిన పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది.

Spread the love