నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ గా ఇటీవలే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ కమిషన్ కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నవీన్ నికోలస్ ను నియమించింది. త్వరలోనే ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఐఏఎస్, ఐపీస్ అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను బదిలీ చేసిన సర్కార్.. ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్‌ను నియమించింది. నికోలస్ గతంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.