టీఎస్‌పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం

– గురుకుల పీఈటీ పోస్టుల భర్తీకి అభ్యర్థుల డిమాండ్‌
– అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్‌
గురుకుల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు గురువారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను ముట్టడించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ నుంచి ఒక్కసారిగా నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో చంటి పిల్లలతో వచ్చిన మహిళా అభ్యర్థులు గాంధీ భవన్‌ ముందు ప్రధాన రోడ్డుపై బైటాయించారు. పోలీసులకు, అభ్యర్థులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వివాదం జరిగింది. దాంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభ్యర్థులను అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. ఆరేండ్లుగా పోస్టులు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేవలం హామీలే ఇస్తున్నారన్నారు. తమకు పోస్టింగ్‌లు ఇచ్చే వరకు అందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

Spread the love