తునికాకు తుస్.?

– టెండర్లు పిలిచేందుకు అధికారులు నిరాసక్తత
– మూడేళ్ళుగా ఆగిపోయిన వైనం
– ఉపాది కోల్పోయిన పేదలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పల్లె జనానికి ఆకుల రూపంలో కాసులు కురిపించే తునికాకు సేకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. టెండర్లకు గుత్తేదారులు ముందుకు రాకపోగా, బీడీలు చుట్టేందుకు ఆకులు పనికి రావని పారెస్ట్ అధికారులు మూడేళ్ళుగా తునికాకు సేకరణకు టెండర్లు పిలవడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు వేసవిలో తునికాకు సేకరణతో పేదలు మంచి ఆదాయం పొందేవారు. నాలుగు మాసాలపాటు ఉపాది లభించేది.ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరేది.అలాంటి తునికాకు సేకరణ పూర్తిగా మరుగున పడడంతో పేదలు ఉపాది కొల్పయారు. మండలంలోని కొయ్యుర్ రేంజ్ పరిధిలో  14,170 హెక్టార్లు,దాదాపు 35 వేల ఎకరాల దట్టమైన అడవి విస్తరించింది.వీటి పరిధిలో తాడిచెర్ల, మల్లారం, కిసన్ రావు పల్లి, షాత్రజ్ పల్లి, పెద్దతూండ్ల,కొయ్యుర్, ఎడ్లపల్లి, రుద్రారం, వళ్లెంకుంట, శభాష్ నగర్ తదితర బిట్ పరిధిల్లో టెండర్లు పిలిచేవారు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి టెండర్లను చేజిక్కించుకొని ఊరూరా తునికాకు కల్లాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో చాటింపు చేయించి ఆకు సేకరణకు పిలిచేవారు.ప్రతియేటా వేసవిలో మార్చి, ఏప్రిల్,మే, జూన్ మాసాల్లో జోరుగా ఆకు సేకరణ జరిగేది.ఆకు సేకరణలో అత్యంత ప్రధాన పాత్ర గిరిజనులదే.వీరి నివాస తండాలు అడవులకు దగ్గరగా ఉండడంతో తెల్లవారుజామునే అడవికి చేరుకొని ఆకు సేకరణలో నిమగ్నమైయ్యేవారు.
2021వరకు సేకరణ…
కొయ్యుర్ రేంజ్ పరిధిలో 2021 వరకు తునికాకు సేకరణ జోరుగా సాగింది.దీంతో గ్రామీణ ప్రాంత పేదలకు చేతినిండా పని దొరికేది.కానీ ప్రస్తుతం టెండర్లు పిలవడం లేదు.చివరగా 2021 టెండర్ల ద్వారా ఒక యూనిట్ ఆకు సేకరణ మాత్రమే జరిగినట్లుగా పారెస్ట్ అధికారులు చెబుతున్నారు.ఒక్కొక్క ఎస్బిలో 3లక్షల తునికాకు కట్టలు, ఒక కట్టలో 100 ఆకులు ఉంటాయని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.ఒక చెట్టు ఆకు తెంపితే 5 నుంచి 8 కట్టలు లభిస్తుంది.ప్రస్తుతం ఒక తునికాకు కట్ట ధర మార్కెట్ లో రూ.7 పలుకుతోంది.ఒక మహిళ నిత్యం 100 కట్టల ఆకు సేకరణ చేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
Spread the love