జంట జల నగరాలు !

మేడ్చల్‌లో మేఘాలు …
ఉప్పల్‌లో ఉరుములు …
మెహదీపట్నంలో మెరుపులు …
చిలకలగూడలో చినుకులు ..!

వనస్థలిపురంలో వర్షం …
కూకట్‌పల్లిలో కుంభవష్టి …
ఈసిఐల్‌లో ఈదురు గాలులు …
పీర్జాదిగూడలో పిడుగులు ..!

వారాసిగూడలో వరదలు …
బేగంబజార్‌లో బురదలు …
ముషీరాబాద్‌లో మురుగు …
అల్వాల్‌లో అలుగు ..!

నాగోల్‌లో నాలాల మత్తడి …
చిక్కడపల్లిలో చిత్తడి …
చర్లపల్లిలో చెట్లు విరగడం …
గోల్కొండలో గోడలు ఒరగడం ..!

జగద్గిరిగుట్టలో జలగండం …
సూరారంలో సుడిగుండం …
మూసాపేట్‌లో ముసురు …
తుకారాంగేట్‌లో తుఫాన్‌ ..!

జంట నగరాలు నీటిలో
నానుతున్నాయి !
ఎడతెరపిలేకుండా వానలు
కురుస్తున్నాయి !!
జంట నగరాలు హై అలెర్ట్‌తో
వణుకుతున్నాయి !!!

– బోనగిరి పాండురంగ

Spread the love