వానమ్మా… రావమ్మా…

తాజాగా సోమవారం సీఎం కేసీఆర్‌ సైతం వర్షాలు, వ్యవసాయం, సాగునీటి అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ చెరువుల్లో నీటిని నింపాలని ఆదేశించారు. అది మంచిదే. కానీ, అదనపు చర్యలు కచ్చితంగా తీసుకోవాల్సిందే. మొదటిసారి విత్తనాలు నష్టపోయిన రైతులకు వాటిని ఉచితంగా అందించడం, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌ కాకుండా జాగ్రత్త పడటం, చివరి ఆయకట్టుదాకా నీరు చేరడానికి ఆయా ప్రాజెక్టుల లైనింగ్‌ కాలువలను సరిచేయడం, నాణ్యతలేని విత్తనాలు అమ్మే వ్యాపారుల లైసెన్స్‌లను రద్దుచేయడం, ఒకవేళ వర్షాభావ పరిస్థితులొస్తే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్లించడం ప్రధానం.
నైరుతి రుతుపవనాల ఆలస్యంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వానాకాలం సాగు అదును దాటుతున్నది. మూడు వారాలవుతున్నా వరుణుడు కరుణించక, వర్షాల కోసం రైతులు ఆకాశానికేసి చూసే దుస్థితి. వర్షపాతం మైనస్‌కు పడిపోగా, ఉష్ణోగ్రత 44డిగ్రీలకు చేరింది. 16జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో పంటల సాగు కాస్త డైలమాలో పడింది. ప్రత్యామ్నాయం వైపు ఆలోచన తప్పకపోవచ్చు. సాధారణంగా రుతుపవనాలు జూన్‌ 10న కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించి వానలు పడాలి. కానీ, ఈ ఏడాది అవి బలహీనడటంతో తొలకరి జాడే లేదు.
సాధారణంగా బోర్లు, బావుల్లో నీరుంటే నిజామాబాద్‌, కామారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ముందస్తుగానే సాగు చేస్తారు. కాగా, తొలకరి పలకరించకపోవడంతో అక్కడా సాగుకు మొగ్గుచూపడంలేదు. ఎల్‌నినో ప్రభావంతో మేఘాలు ఏర్పడటంలో కదలికల్లేవు. వానాకాలంలో సుమారు కోటి 30లక్షల మేర సాగుచేస్తారు. ఇప్పటికే 20లక్షల ఎకరాల్లో విత్తనాలేసినా, తొలకరి లేక సగం కూడా మొలకెత్తలేదు. సుమారు 70శాతం మంది రైతుల నాగళ్లకు పనేలేదు. పత్తి సాగుకు ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో విత్తనాలు చల్లారు. నిజామాబాద్‌, మహబూబాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌, ములుగు జిల్లాల్లో వర్షాభావంతో ఎండిపోతుండటం ఆందోళనకరం. రోహిణి కార్తెలో మే 25 నుంచి సాగుకు శ్రీకారం చుడతారు. జూన్‌ 10 నుంచి 25 వరకు మృగశీర నడుస్తుంది. ఈ కాలంలో పంటలేస్తే రోగాలు అంటవు. ఆరుద్రలో పురుగు విపరీతంగా ఆశించి పంటలు పోతాయి. అయితే రెక్కల పురుగులు, ఆరుద్ర పురుగులు, బల్లిపాత్ర తదితర క్రిమికీటకాలతో పంటలకు మేలే. పంటలపై ఫెరిత్రాయిడ్‌ ఫెస్టిసైడ్స్‌ కొడితే మాత్రం లాభం చేసే క్రీములూ చనిపోతాయి. అందుకే విత్తిన 90రోజులదాకా, ఆ మందులు చల్లొద్దనే సర్కారు నిబంధనలే ఉన్నాయి. కాగా కార్పొరేట్‌ కంపెనీలు, మందుల దుకాణాల యాజమాన్యాలు మాత్రం తమ లాభాల కోసం ఫెస్టిసైడ్‌ వాడకాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. రైతులను మోసం చేస్తున్నాయి. ఇదిలావుంటే, ముందస్తు సర్కారు వ్యవసాయ ప్రణాళికతో వీటిని ఎదుర్కోవచ్చు.
అంటార్కిటికా సముద్రంలోని వేడిగాలులతో అక్కడున్న తేమ ఆవిరై, మబ్బుల్లోనే నీరు కరుగుతున్నది. అదే ‘ఎల్‌నినో’. దాని ఫలితమే రుతుపవనాల ఆలస్యం. ఎండల వేడితగ్గాకనే వర్షాలు కురుస్తాయని అంటున్నది వాతావరణ శాఖ. అప్పటిదాకా విత్తనాలు వేయెద్దంటూ సర్కారు చావు కబురు చల్లగా చెబుతోంది. ఈ ఏడాది ఉగాది పంచాంగం ప్రసంగాల్లో వర్షాలు భారీగా కురుస్తాయని ప్రచారం చేశారు. దీన్ని నమ్మి రైతులు మృగశిరలో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగను లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అయితే వానల్లేక వేసిన విత్తనాలకు పురుగులు ఆశించి, 50శాతం మేర ఆదిలోనే దెబ్బతిన్నాయి. కూలీ, విత్తనాలు, సాగు అవసరాలకుగాను రైతులు ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి పెట్టారు. అలాగే మార్కెట్లో 450గ్రాముల విత్తనాల ప్యాకెట్లను రూ.930కి గాను, రూ.1500కి పెంచి విక్రయిస్తుండటం విడ్డూరం. గత ఏడాది దిగుబడి బాగా వచ్చిందనే పేరుతో బ్రాండెడ్‌ కంపెనీ అయిన రాశీ 659లాంటి విత్తనాల కోసం స్థానిక రైతులతోపాటు కర్నాటక వారూ ఎగబడుతున్నారు. అవేకాకుండా మొక్కజొన్న, నూనెగింజల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో లేవు. వీటిపై వ్యవసాయశాఖకు నియంత్రణే లేదు. నీమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరి స్తున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో సాగుతగ్గే అవకాశం ఉంది. అలాగే కరువూ ఏర్పడే పరిస్థితులూ రావచ్చు. ప్రస్తుతం అన్నిరకాలు కలిపి 20లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలి. కానీ, సర్కారు దగ్గర 22లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. ఒకవేళ అదే నిజమైతే, ఇప్పుడు విత్తనాల ధరలు ఎందుకు పెరుగుతున్నట్టు? అంతేగాక నాణ్యతలేని విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతుండటం దేనికి సంకేతం? ప్రభుత్వం చెప్పిన గణాంకాలే ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండేండ్లుగా వందల మంది అక్రమార్కులు పట్టుబడటం, ఆ కేసులకు సంబంధించి నిందితులకు శిక్షలు పడకుండా తప్పించుకోవడం సర్కారు చిత్తశుద్ధిని తెలిపేదే. తాజాగా సోమవారం సీఎం కేసీఆర్‌ సైతం వర్షాలు, వ్యవసాయం, సాగునీటి అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ చెరువుల్లో నీటిని నింపాలని ఆదేశించారు. అది మంచిదే. కానీ, అదనపు చర్యలు కచ్చితంగా తీసుకోవాల్సిందే. మొదటిసారి విత్తనాలు నష్టపోయిన రైతులకు వాటిని ఉచితంగా అందించడం, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌ కాకుండా జాగ్రత్త పడటం, చివరి ఆయకట్టుదాకా నీరు చేరడానికి ఆయా ప్రాజెక్టుల లైనింగ్‌ కాలువలను సరిచేయడం, నాణ్యతలేని విత్తనాలు అమ్మే వ్యాపారుల లైసెన్స్‌లను రద్దుచేయడం, ఒకవేళ వర్షాభావ పరిస్థితులొస్తే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్లించడం ప్రధానం. అలా చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమేగాక, నిజంగా వ్యవసాయం పండుగే అవుతుంది.

Spread the love