– ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎన్నికల నమోదు అధికారి వి. విక్టర్
నవతెలంగాణ–మద్నూర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామంలో ఈ నెల 27న గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గ్రామ సభల్లో డ్రాఫ్ట్ ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపిస్తామని తెలిపారు. అలాగే మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారినవారి షిఫ్ట్ కేసులు, డబుల్ ఎంట్రీ అయిన ఓటర్ల వివరాలు, గైర్హాజరైన ఓటర్ల జాబితాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.
ప్రతి ఓటరు, గ్రామ ప్రజలు ఈ గ్రామ సభలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని వి. విక్టర్ కోరారు. ఓటరు జాబితాలో పేర్లకు సంబంధించిన తప్పులు, చిరునామా మార్పులు, తొలగింపులపై ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే సభల్లో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామ సభల్లో బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులు పాల్గొని నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ, అభ్యంతరాల నమోదు విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సరైన ఓటరు జాబితా కీలకమని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని వి. విక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ పాల్గొన్నారు.



