భారత్‌లో 12 శాతం మందికి కోత
పొదుపు చర్యలే లక్ష్యం..
బెర్లిన్/న్యూఢిల్లీ : ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఫోక్స్‌వ్యాగన్ భారీ ఉద్వాసనలకు తెరలేపింది. పొదుపు చర్యలకు తోడు అమెరికా సుంకాలు, చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ మందగించడం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఆటో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రస్తుత దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో లక్ష మందిని ఇంటికి పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇది ఆ కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానం కావడం ఆందోళకరం.
ఇప్పటికే అంగీకరించిన 50,000 ఉద్యోగాల కోతకు అదనంగా మరో 50,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికకు యాజమాన్యం ఆమోదం తెలిపింది. జర్మనీలో ఫోక్స్‌వ్యాగన్ శ్రామిక శక్తి 2023లో 275,000 మంది ఉండగా, 2026 జూన్ 30 నాటికి ఆ సంఖ్య 254,000 కు పడిపోయింది.
భారత్‌లోనూ కోతలు..
గ్లోబల్ ప్రక్షాళనలో భాగంగానే భారత్‌లోనూ ఉద్వాసనలకు సిద్దం అయ్యింది. ఇక్కడి మార్కెట్‌లో తదుపరి పెట్టుబడుల ప్రక్రియకు ముందు ఖర్చులను భారీగా తగ్గించుకునే లక్ష్యంతో మూడేళ్ల పునర్నిర్మాణ ప్రణాళికను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తన భారతీయ యూనిట్ అయిన స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియాలో సుమారు 12 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. 2027 నాటికి వివిధ విడతలుగా అమలు చేయనున్న ఈ ప్రణాళికలలో కొన్ని వందల సంఖ్యలో వైట్ కాలర్, షాప్ ఫ్లోర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారతీయ కార్యకలాపాలలో కోట్లాది డాలర్ల వ్యూహాత్మక ఆదాను సాధించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశం. ఉద్యోగుల తొలగింపు సంఖ్యపై వస్తున్న ఊహాగానాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పీయూష్ అరోరా తెలిపారు. భవిష్యత్తులో దేశీయ ఇంజనీరింగ్ బృందాన్ని విస్తరించడంతో పాటు, భారత్‌ను గ్రూప్ తరఫున ఒక కీలక తయారీ, ఇంజనీరింగ్, ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు పెట్టుబడులను మరింతగా పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు భారతదేశంలో తన వ్యాపార యాజమాన్య విధానంలోనూ మార్పులు తెచ్చే దిశగా బిలియనీర్ సజ్జన్ జిందాల్‌కు చెందిన జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌తో చర్చలు జరుగుతుండటం గమనార్హం.
జర్మనీలో ప్రధాన ప్లాంట్లు మూత..
ఈ ప్రక్షాళనలో భాగంగా హనోవర్, ఎండెం, జ్వికావ్, నెకార్‌సల్మ్‌లలోని నాలుగు ప్రధాన జర్మన్ ప్లాంట్ల దీర్ఘకాలిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జర్మనీలో ఫోక్స్‌వ్యాగన్ ఫ్యాక్టరీలు పూర్తిగా మూతపడటం చరిత్రలో ఇదే మొదటిసారయ్యే అవకాశం ఉందని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ప్లాంట్లు, వాటిపై ఆధారపడిన స్థానిక సరఫరాదారులు ఆ ప్రాంతం మొత్తానికి ఇంజిన్ లాంటివని, ఇవి మూతపడితే తీవ్ర ప్రభావం పడుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం ఒక బలమైన సంకేతాన్ని ఇస్తుందని సిఇఒ ఆలివర్ బ్లూమ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం శ్రామిక శక్తికి, భాగస్వాములకు కంపెనీ బాధ్యత వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు..
ఈ భారీ తొలగింపులకు సంబంధించి సమయం, ప్రాంతాల వారీగా ఉద్యోగాల కేటాయింపు వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ భవిష్యత్తులో ఉత్తర అమెరికాపై దృష్టి సారించడంతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలకు ఎగుమతులను విస్తరించాలని ఫోక్స్‌వ్యాగన్ భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏళ్లలో వందల బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని పరిశోధన, అభివృద్ధి, సాంకేతికత మెరుగుదల కోసం పెట్టుబడిగా పెట్టనుంది. తమ ఆధీనంలో ఉన్న వ్యాపారాలు, సంస్థల సంఖ్యను మూడింట ఒక వంతుకు తగ్గించుకోవడం ఈ ప్రణాళికలో కీలక భాగమని కంపెనీ తెలిపింది.
ఫోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాలకు ఎసరు
- Advertisement -
- Advertisement -



