మాణిక్‌రెడ్డికి ఓటెయ్యండి

– ఉపాధ్యాయులకు చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
”మచ్చలేని జీవితం..ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే తత్వం.. గతమంతా ఉద్యమ చరిత్ర ..ఆయనకు ఓటేస్తే మనలను మనం గెలిపించుకున్నట్టే ..అందుకే మేము హామీ ఇస్తున్నాం’..మాణిక్‌రెడ్డికి ఓటేయండి” అంటూ మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీఎస్‌యూటీఎఫ్‌ సీనియర్‌ నేత పాపన్నగారి మాణిక్‌రెడ్డికి ఓటేయాలంటూ మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ డాక్టర్‌. కె. నాగేశ్వర్‌ ఉపాధ్యాయ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ నేపథ్యంలో వారికి ఇరువురూ బహిరంగ లేఖ రాశారు. మీడియాకు విడుదల చేశారు. సోషల్‌మిడియా వేదికగా నాగేశ్వర్‌ వీడియో పాపులర్‌ అవుతున్నది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో మాణిక్‌రెడ్డి రాజీపడబోరని ఇరువురూ వ్యాఖ్యానించారు. సీపీఎస్‌ సమస్య, పీఆర్సీ, అక్రమ బదిలీల విషయంలో ప్రభుత్వంతో నేరుగా పోట్లాడారని చెప్పారు. ఆయన ఎమ్మెల్సీగా శాసనమండలికి వెళితే అక్కడ మీరున్నట్టేనని చెప్పారు. నిజమైన ప్రతినిధిగా ఉపాధ్యాయ లోకానికి సేవలు అందిస్తారు. సొంతపనులు చూసుకోకుండా ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర తపనతో పోరాటం చేసే మాణిక్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీరు గెలిపిస్తే మాణిక్‌రెడ్డి మచ్చలేని ప్రజాజీవితాన్ని గడుపుతాడని హామీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యతా ఓటేయాలని కోరారు. బ్యాలెట్‌లో ఆయన సీరియల్‌ నెంబరు 17 గా పేర్కొన్నారు. ఇదిలావుండగా మాణిక్‌రెడ్డికి మరో సంఘం మద్ధతు ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 12 సంఘాలు సహకారం అందించేందుకు ముందుకొచ్చాయని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.
మాణిక్‌రెడ్డికే మా ఓటు: మేవా
ఉపాధ్యాయుల గొంతుక పాపన్నగారి మాణిక్‌రెడ్డికే మా ఓటు అంటూ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం(మేవా) సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌ మసూద్‌ అహ్మద్‌, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ జుబేర్‌ అహ్మద్‌ లేఖ అందజేశారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వారు ఎలా పనిచేశారో, ఎవరికి ఊడిగం చేశారో మనందరికి తెరిచిన పుస్తకమని గుర్తు చేశారు. ప్రలోభాలు, తాయిలాలకు ఉపాధ్యాయ సమాజం లొంగదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాణిక్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Spread the love