ఓటు వేయడం బాధ్యతగా భావించాలి

– ఓటర్లను చైతన్య పరచడమే స్వీప్‌ ప్రధాన లక్ష్యం
– జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓటు వేయడం భాద్యతగా భావించాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం మక్కా మజీద్‌లో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. వంద శాతం ఓటింగ్‌ అయ్యేలా ఓటర్లను చైతన్య పరచడమే స్వీప్‌ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా హైదరాబాద్‌ జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నామన్నారు. మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేయాలని కోరారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిదీ చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మక్కా మసీద్‌ ఆవరణలో మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, కొత్తగా ఓటరు నమోదుకు ఫారం -6, ఇల్లు మార్చినట్లైతే ఫారం -8 తీసుకుని అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మే,13 పోలింగ్‌ రోజున ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేసి, ఓటింగ్‌ శాతం పెరిగేలా సహకరించాలని కోరారు. ఎలాంటి సంకోచాలు, అపోహలకు తావివ్వకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. గతంలో కంటే ఎక్కువ ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఓటరు చైతన్య కార్యక్రమాలను విస్తతంగా నిర్వహించనున్నట్లు ఓటింగ్‌ పెరగక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు వాటిని అధిగమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్‌ పేర్కొన్నారు. అనం తరం జాయింట్‌ సీఈవో సర్పరాజ్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించు కావాలన్నారు. ఓటర్‌ జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు చెక్‌ చేసుకోవాలని, ఏప్రిల్‌ 15 వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్‌ జిల్లాలో ఓటర్‌ టర్న్‌ అవుట్‌ పెంచే దిశగా విస్తతంగా స్వీప్‌ కార్యక్రమాలు డీఈఓ సహకారంతో చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఐ ఓట్‌ ఫర్‌ షఉర్‌ అన్న నినాదం గల ప్ల కార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అడిషనల్‌ కమిషనర్‌ అలివేలు మంగ తయారు, అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకాంత్‌ రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ వెంకట్‌ రెడ్డి, స్వీప్‌ నోడల్‌ అధికారులు అరుణకుమారి, యుగెందర్‌ రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ వెంకన్న నాయక్‌, డిప్యూటీ కమిషనర్‌. సరిత కమ్యూనిటీ ఆర్గనైజర్‌లు, ఆర్‌పీల తదితరులు పాల్గొన్నారు.

Spread the love